తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టికెట్ల విడుదల షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. డిసెంబర్ 20 నుంచి 29 వరకు పది రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. తొలి రెండు రోజుల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్లాటెడ్ సర్వదర్శనం, దాతల దర్శన కోటా టికెట్లను విడతలవారీగా విడుదల చేయనున్నారు.
దర్శన టికెట్ల విడుదల షెడ్యూల్ ఇదే..
- నవంబర్ 28న ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్ల విడుదల.
- నవంబర్ 30న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల.
- డిసెంబర్ 1 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కోసం ఈ-డిప్ నమోదు.
- డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు ఈ-డిప్ నమోదు ముగింపు.
- డిసెంబర్ 7న మధ్యాహ్నం 3 గంటలకు ఈ-డిప్ ద్వారా టోకెన్ల కేటాయింపు.
- డిసెంబర్ 8న ఉదయం 10 గంటలకు దాతల దర్శన కోటా టికెట్ల విడుదల.
వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యే డిసెంబర్ 20, 21 తేదీల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం కల్పించనున్నారు. ఈ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేశారు. ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాల విషయంలో మినహాయింపు కల్పించనున్నారు. స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్ ఈ-డిప్ విధానంలో కేటాయించనున్నారు.
టీటీడీ అధికారిక వెబ్‌సైట్: https://ttdevasthanams.ap.gov.in








