సినిమా : భోగి
నటీనటులు: శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి, శరత్ లోహితశ్వ, అవినాష్, లాల్, శివకుమార్ తదితరులు
రచన, దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: కె.కె. రాధామోహన్
నిర్మాణ సంస్థ: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
సినిమాటోగ్రఫీ: కిషోర్ కుమార్ అరోకియా
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటింగ్: తమ్మిరాజు
విడుదల తేది: నవంబర్ 27, 2026
‘బైకర్’ సినిమాతో మంచి హిట్ అందుకున్న శర్వానంద్.. డైరెక్టర్ సంపత్ నందితో కలిసి ‘భోగి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమాతో శర్వానంద్ మరో విజయాన్ని అందుకున్నారా..? డైరెక్టర్ సంపత్ నంది స్క్రీన్‌పై తన కథతో ప్రేక్షకులను మెప్పించాడా..? అనేది చూద్దాం..
కథాంశం ఏమిటి?
1960ల కాలంలో తెలంగాణలోని ‘బొగ్గుల గుట్ట’ అనే ఊరి నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామా ఇది. ఆ ఊరి పటేల్ (శరత్ లోహితశ్వ) చెప్పిందే అక్కడ శాసనం. ఊరికి ఏ కష్టం వచ్చినా పటేల్ పూజలతో ఆదుకుంటాడని జనం నమ్ముతారు. అదే గ్రామంలో ఐదుగురు చెల్లెళ్లు, అన్నయ్యతో కలిసి కమ్మరి వృత్తి చేస్తూ బతుకుతుంటాడు గంగ (శర్వానంద్). అన్నయ్యకు అమ్మవారు పోసి మంచాన పడటంతో పాటు, ఊరి పెద్ద అప్పగించిన పని కోసం పాలెగాళ్లతో కలిసి అడవికి వెళ్లిన గంగకు అక్కడ ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాల ముసుగులో పటేల్, పూజారి (అవినాష్) సాగిస్తున్న రహస్య అరాచకాలు ఏమిటి? వాటిని గంగ ఎలా ఎదుర్కొన్నాడు? సులోచన రాణి (అనుపమ పరమేశ్వరన్), మందారం (డింపుల్ హయాతి) పాత్రల నేపథ్యం ఏమిటి? అనేది తెరపై చూడాల్సిన అంశం.
కథనం – విశ్లేషణ
ఈ మధ్యకాలంలో కథా బలం కంటే హింస, రక్తపాతానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న ధోరణి కనిపిస్తోంది. మూఢనమ్మకాలు, గ్రామీణ సామాజిక అంశాలను తీసుకున్నా.. వాటిని బలమైన భావోద్వేగాలతో ముడిపెట్టకుండా, కేవలం షాక్ ఇవ్వాలనే రీతిలో హింసాత్మక సన్నివేశాలను పేర్చడంతో సినిమా ఆరంభంలో ఉన్న ఆసక్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది.
మొదటి భాగం
బొగ్గుల గుట్ట వాతావరణం, పటేల్‌కు ఇచ్చే ఎలివేషన్, హీరో కుటుంబ నేపథ్యం, పాటలతో తొలి అరగంట పర్వాలేదనిపిస్తుంది. టైటిల్ కార్డ్స్‌లో వచ్చే నాలుగు దృశ్యాలు కథా సూచనలుగా సాగినా, ఆ తర్వాత కథనం ఊహకందేలా మారుతుంది. విలన్ ముఖాన్ని దాచిపెడుతూ సాగదీసిన సన్నివేశాలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి.
రెండో భాగం
ద్వితియార్థంలో యాక్షన్ ఎపిసోడ్లు, హింసాత్మక దృశ్యాలు ఎక్కువైపోవడంతో కథనం నెమ్మదించినట్లు అనిపిస్తుంది. ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే మలుపు, కొన్ని పదునైన సంభాషణలు కొంత ఊరటనిచ్చినా, మొత్తం కథనాన్ని నిలబెట్టడంలో దర్శకుడు సంపత్ నంది తడబడ్డారు. ఎడిటింగ్ విషయంలో సెకండాఫ్‌పై ఇంకాస్త కత్తెర వేసి ఉంటే బాగుండేది.
నటీనటులు – సాంకేతిక వర్గం
గంగ పాత్రలో శర్వానంద్ ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాల్లో మెప్పించాడు; తెలంగాణ యాసలోనూ బాగానే ఒదిగిపోయాడు. సులోచన రాణిగా అనుపమ పరమేశ్వరన్, మందారం పాత్రలో డింపుల్ హయాతి తమ పరిధి మేరకు చేశారు. పటేల్ పాత్రలో శరత్ లోహితశ్వ, ఇతర నటీనటులు పాత్రలకు తగ్గట్లు నటించినా, బలహీనమైన రచన కారణంగా పాత్రలు పూర్తిస్థాయిలో నిలబడలేదు.
సాంకేతిక అంశాలు: ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ప్రధాన బలం. మారుమూల గ్రామీణ నేపథ్యాన్ని, రాత్రి వేళ సన్నివేశాలను కిషోర్ కుమార్ అరోకియా చక్కగా బంధించారు. భీమ్స్ అందించిన పాటలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఆకట్టుకున్నా, నేపథ్య సంగీతం కొన్ని చోట్ల లౌడ్‌గా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
మంచి సామాజిక అంశాన్ని ఎంచుకున్నప్పటికీ, మితిమీరిన హింస, సాగతీత సన్నివేశాల వల్ల ‘భోగి’ ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.








