దేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. జనాభా లెక్కలతో సంబంధం లేకుండా డీలిమిటేషన్ చేపట్టడంతో పాటు అన్ని రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలను ఏకంగా 50 శాతం పెంచే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును మళ్లీ ముందుకు తీసుకెళ్లడమే ఈ ప్రతిపాదనల వెనుక ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. నవంబర్ 30న లోక్సభ, డిసెంబర్ 2న రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గత ఏప్రిల్లో మహిళా రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్తో ముడిపెడుతూ తీసుకొచ్చిన రాజ్యాంగ 131వ సవరణ బిల్లుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో అది వీగిపోయింది. 540 మంది సభ్యులున్న ప్రస్తుత లోక్సభలో బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 360 మంది సభ్యుల మద్దతు అవసరం. ఎన్డీయేకు సుమారు 320 మంది ఎంపీల మద్దతు ఉండటంతో ఇతర పార్టీల మద్దతు కీలకంగా మారింది.
మరోవైపు తాజాగా మారిన రాజకీయ సమీకరణాలు కేంద్ర ప్రభుత్వానికి కొంత ఊరటనిస్తున్నట్లు తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి 20 మంది ఎంపీలు విడిపోయి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమై ఎన్డీయేకు మద్దతు ప్రకటించినట్లు సమాచారం. అలాగే శివసేన యూబీటీ నుంచి ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో విపక్షాల సంఖ్యాబలం తగ్గినప్పటికీ రాజ్యాంగ సవరణకు అవసరమైన మెజారిటీ సాధించేందుకు ఎన్డీయేకు మరింత మద్దతు అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో డీఎంకే, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) వంటి పార్టీల వైఖరి కీలకం కానుంది.
ఇదిలా ఉండగా, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR)లో అవకతవకలు జరిగాయంటూ విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా అంశాలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాన చర్చకు వచ్చే అవకాశం ఉంది. లోక్సభ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదన అమలైతే రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యంలో ఎలాంటి మార్పులు వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








