ప్రేమించిందని కన్నకూతురినే హతమార్చిన తండ్రి

ప్రేమించిందని కన్నకూతురినే హతమార్చిన తండ్రి

Summarize with AI

మేనత్త కుమారుడిని ప్రేమించిందన్న కారణంతో కన్నకూతురినే హతమార్చాడు ఓ తండ్రి. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించి, హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించాడు. స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించగా అసలు విషయం బయటపడింది. ఈ దారుణ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం ఉమ్రి గ్రామంలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన కైలాస్‌, సుమిత్ర దంపతులు తమ కుమార్తె కల్యాణి (18)కి మరో యువకుడితో ఈ నెల 25న నిశ్చితార్థం జరిపేందుకు నిర్ణయించారు. అయితే, ఈ నెల 23న కుమార్తె బాధపడుతుండటాన్ని గమనించిన కైలాస్‌ కారణమేంటని నిలదీశాడు. తాను మేనత్త కుమారుడిని ప్రేమిస్తున్నానని కల్యాణి చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కుమార్తె నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని పక్క గదిలోకి తీసుకెళ్లి ఉరికి వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు.

ఉదయం నిద్రలేచిన సుమిత్ర ఉరికి వేలాడుతున్న కుమార్తెను చూసి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అయితే, కేవలం మూడు గంటల్లోనే అంత్యక్రియలు పూర్తి చేయడం, లంబాడ సంప్రదాయం ప్రకారం పెళ్లికాని యువతిని ఖననం చేయాల్సి ఉండగా దహనం చేయడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా, కుటుంబ పరువు పోతుందనే ఉద్దేశంతో తానే కుమార్తెను హత్య చేసినట్లు కైలాస్‌ అంగీకరించాడు. పరువు పేరుతో కన్నకూతురి ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Join WhatsApp

Join Now

Leave a Comment