పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార తెలుగుదేశం పార్టీ అరాచకాలు ఏమాత్రం తగ్గలేదు. పల్లె పోరులోనూ టీడీపీ నేతలతో పోలీసులు కుమ్మకై తీవ్రమైన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఓటర్లు, వైసీపీ సానుభూతిపరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం నాగసముద్రంలో వైసీపీ మద్దతు దారులపై టీడీపీ శ్రేణులు దాడులకు దిగారు. ఓట్లు వేస్తే చంపుతామంటూ పోలీసుల సమక్షంలో బెదిరింపులకు దిగారు. పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయులు ఓటర్లపై దాడులకు తెగబడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని ఆరోపిస్తూ వైసీపీ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో వైసీపీ మద్దతుదారులను పోలింగ్ బూత్‌లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని లాఠీచార్జ్ చేసినట్లు సమాచారం.
తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం టి.కమ్మపల్లెలో ఉదయమే పోలింగ్ బూత్‌ను టీడీపీ ఆక్రమించిందని వైసీపీ నాయకులు తెలిపారు. తమ ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించకుండా అడ్డుకోవడంతో పాటు, ఏజెంట్ల ఫారాలను చించి వెనక్కి పంపించారని పేర్కొన్నాయి. దీంతో వైసీపీ ఏజెంట్లు పోలింగ్ బూత్ వద్ద ధర్నాకు దిగారు. పోలీసుల సమక్షంలోనే వైసీపీ కార్యకర్తలపై దాడులు జరిగినట్లు సమాచారం.
అనంతపురం రూరల్ పంచాయతీలో నకిలీ ఓటరు కార్డులతో టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించగా, ప్రశ్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తొంది.
అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం రౌతుకుంటలో వైసీపీ పోలింగ్ ఏజెంట్లు, అభ్యర్థులను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించలేదని ఆరోపణలు వచ్చాయి. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు, ఏజెంట్లు ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేశారు. అదే మండలంలో దళిత మహిళా అభ్యర్థులు, ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగినట్లు సమాచారం. వారిని పోలీసులు జీపులో ఎక్కించి తీసుకెళ్లారని, రౌతుకుంటలో తమ అభ్యర్థి కనిపించడం లేదంటూ గ్రామస్తులు సీఐని నిలదీశారని ఆరోపణలు ఉన్నాయి. ఘటనను వీడియో తీస్తున్న వారి ఫోన్‌ను పోలీసులు లాక్కున్నారని, పోలీసుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
మరోవైపు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బెస్తరపల్లిలో వైసీపీ మద్దతుదారులకు చెందిన గడ్డి వాములకు టీడీపీ నేతలు నిప్పు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఇలా పలు జిల్లాల్లో ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలు, దాడులు, పోలీసుల వ్యవహారశైలిపై వివాదాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.








