ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల పదవుల పంపకాలపై కూటమి పార్టీల మధ్య అసంతృప్తి వ్యక్తమవుతోంది. తాజాగా విశాఖ డిప్యూటీ మేయర్ పదవి బీజేపీకి దక్కకపోవడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ధర్మాన్ని గౌరవించడం కోసం చేతులు కట్టుకుని కూర్చోవాల్సి వచ్చిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
విశాఖపట్నంలో మేయర్ పదవి బీజేపీకి దక్కకపోయినా కనీసం డిప్యూటీ మేయర్ పదవైనా వస్తుందని ఆశించామని విష్ణుకుమార్ రాజు తెలిపారు. అయితే ఆ అవకాశం కూడా దక్కకపోవడంతో నిరాశకు గురయ్యామని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన స్థాయిలో కార్పొరేటర్ స్థానాలు రాలేదని, కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ పదవుల పంపకాల్లో తగిన అవకాశం లభించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
“కూటమి ధర్మం కోసం చేతులు కట్టుకుని కూర్చున్నాం” అంటూ విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. మేయర్ పదవి దక్కకపోయినా డిప్యూటీ మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్నామని, చివరకు అది కూడా రాకపోవడం బాధాకరమన్నారు. కూటమి ధర్మాన్ని గౌరవిస్తూ తప్పనిసరి పరిస్థితుల్లో సర్దుకుపోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికలు ముగిసి మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎంపిక పూర్తయిన తర్వాత డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ల పదవుల పంపకాలు కూడా ముగిశాయి. ఈ నేపథ్యంలో విశాఖలో బీజేపీకి డిప్యూటీ మేయర్ పదవి దక్కకపోవడంపై విష్ణుకుమార్ రాజు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ తమ పార్టీకి ఆశించిన ప్రాధాన్యత లభించలేదన్న ఆయన వ్యాఖ్యలు విశాఖ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.








