“అభినవ నీరో చక్రవర్తి రేవంత్ రెడ్డి”

"అభినవ నీరో చక్రవర్తి రేవంత్ రెడ్డి"

Summarize with AI

రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి పాలన కరువు కోరల్లోకి నెట్టివేసిందని, రోమ్ నగరం కాలిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు.. తెలంగాణ కరువుతో నకనకలాడుతుంటే ముఖ్యమంత్రి మూసీ సుందరీకరణ పేరుతో ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు.

తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం లిఫ్ట్‌ల ద్వారా పొలాలకు పారించిన నీళ్లను నిలిపివేసి, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీళ్లు ఇచ్చే దుస్థితికి తెచ్చిందని మండిపడ్డారు.

“మూసీ సుందరీకరణకు అసలు డీపీఆర్ ఉందా? ఉంటే రేవంత్ రెడ్డి వెంటనే దాన్ని పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి. పబ్లిక్ హియరింగ్ లేకుండా పేద ప్రజల ఇళ్లను ఎలా కూల్చుతారు? బాధితుల తరఫున బీఆర్‌ఎస్ న్యాయపోరాటానికి సిద్ధంగా ఉంది” అని కేటీఆర్ హెచ్చ‌రించారు.

రాష్ట్రాలో తాగునీటికి, సాగునీటికి దిక్కు లేకపోతే మల్లన్న సాగర్ నుంచి 10 టీఎంసీల నీళ్లను తెచ్చి మూసీలో పోస్తారా అని నిలదీశారు. మూసీ పేరుతో జరుగుతున్న లక్షన్నర కోట్ల రూపాయల “లూటీకరణ”పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. మూసీకి కేటాయించే ఆ లక్షన్నర కోట్లను తక్షణమే కరువు బారిన పడిన రైతాంగాన్ని ఆదుకునేందుకు మళ్లించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో ప్రస్తుతం అంబేద్కర్ రాజ్యాంగం అమలులో ఉందా? లేక రేవంత్ రెడ్డి సొంత “అనుముల రాజ్యాంగం” నడుస్తోందా? అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలకు, ఐటీ కారిడార్లకు కరెంట్ ఇవ్వలేక ‘పవర్ హాలిడే’ ప్రకటిస్తున్న ఈ రాష్ట్రంలోకి కొత్తగా పెట్టుబడులు ఎవరు పెడతారని ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కేవలం ఒక “గోబెల్స్ సమ్మిట్” అని ఎద్దేవా చేస్తూ.. మూడేళ్లలో వచ్చిన పెట్టుబడులపై ప్రభుత్వం శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలని సవాల్ విసిరారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై చేసిన అసత్య ప్రచారాలు ఒక్కొక్కటిగా పటాపంచలై నిజం బయటపడుతోందని, రాబోయే రోజుల్లో మరికొందరు క్షమాపణలు చెప్పక తప్పదని ధ్వజమెత్తారు. మంత్రి కొండా సురేఖ చేసిన క్ష‌మాప‌ణ వ్యాఖ్యల ఉదంతంపై తమ లీగల్ టీమ్‌తో చర్చించి చట్టపరమైన తగిన నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment