WPL 2027 మినీ వేలం పూర్తి.. ఐదు జట్ల పూర్తి స్క్వాడ్స్ ఇవే!

WPL 2027 మినీ వేలం పూర్తి.. ఐదు జట్ల పూర్తి స్క్వాడ్స్ ఇవే!

Summarize with AI

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027 ఐదో సీజన్‌కు సంబంధించిన మినీ వేలం ముగిసింది. కొచ్చి వేదికగా బుధవారం జరిగిన ఈ వేలంలో ఐదు ఫ్రాంచైజీలు తమ జట్లను మరింత బలోపేతం చేసుకున్నాయి. మొత్తం 25 మంది క్రీడాకారిణులు వేలంలో అమ్ముడుపోగా, వారిలో 18 మంది భారతీయులు, ఏడుగురు విదేశీ ప్లేయర్లు ఉన్నారు. పరిమిత స్లాట్‌లు, అందుబాటులో ఉన్న నిధుల మధ్య ఫ్రాంచైజీలు తమ అవసరాలకు అనుగుణంగా ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. దీంతో WPL 2027 సీజన్‌కు సంబంధించి జట్ల కూర్పు దాదాపుగా పూర్తయింది.

ఈ వేలంలో యూపీ వారియర్జ్ అత్యంత చురుగ్గా వ్యవహరించి ఎనిమిది మంది ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. ముంబై ఇండియన్స్ ఆరుగురిని కొనుగోలు చేయగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ చెరో నలుగురు ప్లేయర్లను ఎంపిక చేసుకున్నాయి. గుజరాత్ జెయింట్స్ మూడు కొనుగోళ్లతో వేలాన్ని ముగించింది. WPL నిబంధనల ప్రకారం ఒక్కో జట్టులో గరిష్ఠంగా 18 మంది సభ్యులు ఉండవచ్చు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ జట్లు 18 మంది ఆటగాళ్లతో పూర్తి స్క్వాడ్‌లను సిద్ధం చేసుకున్నాయి. RCB, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం 17 మంది సభ్యులతోనే తమ జట్లను ఖరారు చేసుకున్నాయి.

జట్ల విషయానికొస్తే.. ముంబై ఇండియన్స్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్, నాట్ సివర్-బ్రంట్, హేలీ మాథ్యూస్, అమేలియా కెర్ వంటి కీలక ఆటగాళ్లు ఉండగా, RCBకి స్మృతి మంధాన, రిచా ఘోష్, ఎలీస్ పెర్రీ ప్రధాన బలంగా నిలవనున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ జెమిమా రోడ్రిగ్స్ నాయకత్వంలో బరిలోకి దిగనుండగా, షెఫాలీ వర్మ, లారా వోల్వార్డ్ట్ వంటి ఆటగాళ్లు జట్టుకు కీలకం కానున్నారు. మెగ్ లానింగ్ సారథ్యంలోని యూపీ వారియర్జ్‌లో దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, గ్రేస్ హ్యారిస్ వంటి ప్రతిభావంతులున్నారు. మరోవైపు, యాష్లే గార్డ్‌నర్ నేతృత్వంలోని గుజరాత్ జెయింట్స్‌లో బెత్ మూనీ, సోఫీ డివైన్, రేణుకా సింగ్ ఠాకూర్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఈ జట్ల కూర్పుతో WPL 2027 సీజన్‌లో పోటీ ఆసక్తికరంగా మారనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment