ఒకవైపు సీట్ల సర్దుబాటు, మరోవైపు ప్రతిపక్ష పార్టీపై దాడులతో అధికార కూటమి ప్రభుత్వం బిజీగా ఉంది. పోలీసులు సైతం ఎలక్షన్ డ్యూటీలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఆరేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు.
వివరాల్లోకి వెళితే.. తల్లిదండ్రులు బేల్దారి పనులకు హైదరాబాద్‌కు వెళ్లగా, చదలవాడ ఎస్సీ కాలనలో అమ్మమ్మ వద్ద ఉంటోన్న ఆరేళ్ల బాలికపై అదే కాలనీకి చెందిన అజ్జం ఆనంద్(జనసేన యాక్టవిస్టు) యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆరుబయట నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన ఆనంద్.. అనంతరం మృతదేహాన్ని ఇంటి వద్ద కుర్చీలో కూర్చోబెట్టి పరారైయ్యాడు.
ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను చికిత్స నిమిత్తం ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొనగా, స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
బాలిక మృతితో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, బంధువులు ఒంగోలు–చీరాల ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ రహదారిపై నిరసన తెలిపారు. మరోవైపు, నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశ్నార్థకంగా మారాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడులు, కక్షసాధింపులపై ఉన్న శ్రద్ధ.. మహిళలు, చిన్నారుల రక్షణపై లేదా..? ప్రభుత్వం కఠినంగా ఉంటే ఇలాంటి ఘటనలు ఎందుకు పునరావృతం అవుతాయని ప్రశ్నిస్తున్నారు.








