గ్రామీణ మహిళలు ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించి లక్షాధికారుల నుంచి కోటీశ్వరులుగా ఎదగాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆకాంక్షించారు. విజయవాడలో నిర్వహించిన జాతీయ సరస్ మేళా–2026 కార్యక్రమంలో పాల్గొన్న ప్రసంగించారు. దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలు పాల్గొంటున్న ఈ మేళాను విజయవాడలో ఏర్పాటు చేయడాన్ని గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖను అభినందించారు.
గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని రాష్ట్రపతి చెప్పారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల్లో ఆర్థిక చైతన్యం పెరుగుతోందని, వారి ఆదాయాన్ని పెంచుకునేందుకు మరిన్ని అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాలకు సూచించారు.
మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మెరుగైన గుర్తింపు లభించేలా బ్రాండింగ్, ప్యాకేజింగ్, నెట్వర్కింగ్పై అవగాహన పెంచడంలో సరస్ మేళాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. మధ్యవర్తుల వ్యవస్థను తొలగించి, గ్రామీణ మహిళా రైతులకు అండగా నిలవాలని కోరారు. డిజిటల్ విధానాలపై మహిళలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు.
మహిళలు, పురుషులు కలిసి పనిచేసినప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్న ముర్ము.. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు. త్వరలో తెలుగు భాష నేర్చుకుని ప్రజలతో తెలుగులో మాట్లాడేందుకు వస్తానని హామీ ఇచ్చారు.








