సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా షికారు చేస్తున్న “రష్యా యువతి – బీహార్ యువకుడి విదేశీ ప్రేమాయణం” కథనంలో ఊహించని బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. వారిద్దరి మధ్య ఎలాంటి ప్రేమాయణం లేదని, అసలు ఆ యువకుడు విదేశాలకు వెళ్లనే లేదని సంచలన విషయాలు బటయపడ్డాయి. ఎన్జీవో (NGO) పనిమీద గ్రామానికి వచ్చిన ఒక విదేశీ యువతిని వీడియో తీసి, కొందరు ఆకతాయిలు కట్టుకథలు అల్లుతూ వైరల్ చేశారని తేలింది.
అసలు జరిగింది ఇదీ!
బీహార్లోని పూర్ణియా జిల్లాలో బ్రిటిష్ దేశానికి చెందిన ‘శివియ’ అనే స్వచ్ఛంద సంస్థ (NGO) తరఫున మహిళల స్వయం ఉపాధి, సాధికారతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ ప్రాజెక్టులో భాగంగా ‘ఆండ్రియా కొనాలి’ అనే విదేశీ యువతి స్థానిక ‘సాథి’ అనే సంస్థతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తోంది. గ్రామాల్లో తిరుగుతున్న సమయంలో, అక్కడ ఉన్న స్థానిక మహిళలు ఆండ్రియా కొనాలికి స్వాగతం పలుకుతూ ఒక పూల బొకేను అందించారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్న ‘నమిత్’ అనే యువకుడు (వైరల్ వీడియోలో రాహుల్ అనే పేరుతో ప్రచారం చేసిన వ్యక్తి) ఆమెతో సాధారణంగా మాట్లాడాడు.
ఆ సమయంలో తీసిన దృశ్యాలను ఆధారంగా చేసుకుని కొందరు సోషల్ మీడియా ఆకతాయిలు, యూట్యూబర్లు పక్కా స్కెచ్ వేశారు. “రష్యా యువతి కోసం ప్రేమికుడు బీహార్ వచ్చాడు”, “విదేశాల నుంచి వచ్చి పెళ్లి చేసుకున్నారు” అంటూ అసత్య ప్రచారాలతో, వ్యూస్ కోసం కట్టుకథలతో వీడియోలు సృష్టించి నెట్టింట వైరల్ చేశారు.
ఈ తప్పుడు ప్రచారంపై ‘సాథి’ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో మంచి ఉద్దేశంతో మహిళల సాధికారత కోసం పనిచేస్తున్న విదేశీ ప్రతినిధిపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఈ ఫేక్ లవ్ స్టోరీపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సంస్థ నిర్వాహకులు వెల్లడించారు.
ఈ విషయంలో నమిత్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన ప్రస్తుతం అందుబాటులోకి రాలేదని.. పోలీసులు, చట్టపరమైన విచారణ జరిపితే అతడిని కూడా విచారించే అవకాశం ఉందని తెలిపారు. కేవలం వ్యూస్, లైక్స్ కోసం సోషల్ మీడియాలో ఎలాంటి నిజానిజాలు తెలుసుకోకుండా కట్టుకథలు అల్లి ప్రచారం చేసేవారి వైఖరిపై ఇప్పుడు సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.








