గోవా కాంగ్రెస్ (Goa Congress) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గోయ్ రాఖోన్న్ యాత్ర’ (Save Goa Campaign) ముగింపు సందర్భంగా కున్కోలిమ్‌లో (Cuncolim) జరిగిన భారీ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (A. Revanth Reddy) ముఖ్య అతిథిగా పాల్గొని బీజేపీ (BJP) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో ప్రజా నిరసన కార్యక్రమాల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గోవాకు రాలేకపోయారని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఆదేశాల మేరకు ఆయన ప్రతినిధిగా తాను హాజరయ్యానని తెలిపారు. గోవా ప్రజలు బీజేపీ పాలనతో విసిగిపోయారని, మరోసారి ఆ పార్టీ అధికారంలోకి వస్తే స్థానిక ప్రజలు తమ సొంత గడ్డపైనే పరాయివారిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌ను (Pramod Sawant) లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి, రాష్ట్ర అభివృద్ధి కంటే భూములు, ఆస్తులను ఇతరులకు అప్పగించడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందని ఆరోపించారు. అందుకే ప్రజలు ఆయనను ‘ప్రాపర్టీ సావంత్’ అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలనలో గోవా డ్రగ్స్ కేంద్రంగా మారుతోందని విమర్శిస్తూ, ‘నషా ముక్త్ భారత్’(Nasha Mukt Bharat – Drug-Free India)నినాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) గోవాలో ఎందుకు సమర్థంగా అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
దేశంలో ఎన్నికల వ్యవస్థను అడ్డుపెట్టుకుని పేదలు, దళితులు(Dalits), మైనారిటీలు(Minorities), ఆదివాసీల(Adivasis) ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) పేరును ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రక్రియపై విమర్శలు చేశారు. దేశంలో జరుగుతున్న రాజకీయ పోరాటాన్ని రావణుడికి(Ravana), రాముడికి (Rama)మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణిస్తూ, బీజేపీ(BJP) పాలనకు ముగింపు పలకడానికి ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. గతంలో రెండుసార్లు బీజేపీని నమ్మి మోసపోయిన గోవా ప్రజలు మరోసారి ఆ తప్పు చేయవద్దని కోరారు. రుతుపవనాలు తొలుత కేరళలో ప్రవేశించి, ఆ తర్వాత గోవాకు చేరుకునే విధానాన్ని ప్రస్తావిస్తూ, కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినట్లే 2027లో గోవాలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గోవాలో ప్రారంభమయ్యే రాజకీయ మార్పు దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ విజయానికి దారితీయాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం పార్టీ ప్రయోజనాల కోసం కాదని, గోవా ప్రజల భవిష్యత్తును కాపాడటమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.








