ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న అనూహ్య నిర్ణయం పార్టీ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల నియమించిన సమన్వయకర్తలు, ముగ్గురు సభ్యుల సమన్వయ కమిటీలు, సపోర్ట్ టీమ్స్‌తో పాటు 25 మంది సభ్యులతో కూడిన పార్లమెంట్ కమిటీలను రద్దు చేస్తున్నట్లు అధిష్ఠానం ప్రకటించడం వెనుక పెద్ద పొలిటికల్ డ్రామా దాగి ఉందనే ప్రచారం ఊపందుకుంది.
క్షేత్రస్థాయిలో పార్టీకి ప్రాణమిచ్చే జనసైనికుల ఆకాంక్షలను పక్కనబెట్టి, సీఎం చంద్రబాబు నాయుడితో కుదిరిన సీట్ల వాటా కోసమే పవన్ ఈ కమిటీలను రద్దు చేశారని పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఎక్కువ సీట్లు అడగడమే తప్పైపోయిందా..?
2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం, ముఖ్యంగా టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి క్షేత్రస్థాయిలో జనసేన క్యాడర్ అహర్నిశలు శ్రమించింది. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ సంస్థాగత ఎదుగుదలకు, క్యాడర్‌కు గుర్తింపు తెచ్చేందుకు అత్యంత కీలకమని జనసైనికులు భావించారు.
ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ నియమించిన కమిటీల ముందుకు వెళ్లిన క్షేత్రస్థాయి కార్యకర్తలు.. తాము పోటీకి సిద్ధంగా ఉన్నామని, స్థానిక ఎన్నికల్లో జనసేనకు మెజార్టీ స్థానాలు కేటాయించాలని పట్టుబట్టారు. క్యాడర్ అభిప్రాయాల ఆధారంగా ఆయా కమిటీల సభ్యులు కూడా జనసేనకు ఎక్కువ స్థానాలు కేటాయించాలని కోరుతూ పవన్ కళ్యాణ్‌కు స్పష్టమైన నివేదికలు సమర్పించారు.
బాబు ఇబ్బంది పడకూడదనే రద్ధా?
అయితే, జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయించాలని గట్టిగా డిమాండ్ చేస్తే మిత్రపక్షమైన చంద్రబాబుకు కష్టమవుతుందని, పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడిని, డిమాండ్లను చూసి ఆగ్రహానికి గురైన పవన్.. చంద్రబాబుతో కుదిరిన ‘పొలిటికల్ డీల్’ ప్రకారం సీట్ల సంఖ్యను తగ్గించుకునేందుకే ఈ కమిటీలను రద్దు చేశారన్న విమర్శలు వస్తున్నాయి. క్యాడర్ డిమాండ్ల కంటే.. చంద్రబాబుతో పొత్తుకు ప్రాధాన్యమిస్తూ రాత్రికి రాత్రే కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీలంటూ హడావుడి చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాబోయేవి చంద్రబాబు కమిటీలా?
కష్టపడి పనిచేసిన క్యాడర్‌ను ప్రోత్సహించాల్సింది పోయి, వారిని ‘రెచ్చగొడుతున్నారు’ అనే సాకుతో కమిటీలనే రద్దు చేయడంపై జనసైనికులు తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. పాత కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీలను వేస్తామని ప్రకటించారు. వచ్చే కొత్త కమిటీలు నిజంగా జనసేన ప్రయోజనాల కోసం పనిచేసేవా లేక చంద్రబాబు ఇచ్చే కొన్ని సీట్లకు తల ఊపే “చంద్రబాబు అనుకూల కమిటీలా” అనే చర్చ సాధారణ ప్రజల్లోనూ, రాజకీయ విశ్లేషకుల్లోనూ సాగుతోంది.
కూటమి ధర్మం పేరుతో ప్రతిసారీ జనసేన ప్రయోజనాలను, కార్యకర్తల ఆశలను చంద్రబాబు దగ్గర తాకట్టు పెడుతున్నారన్న ఆవేదన జనసైనికుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. నిలదీసే గొంతుకలని నొక్కేసి, చంద్రబాబుతో రాజీపడటానికే పవన్ ఈ రకమైన చర్యలకు దిగుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.







