గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం ఇప్పుడు కేసుల నమోదుకు దారితీసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు తరలివచ్చిన ఉద్యోగులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు శాంతియుతంగా నిరసన చేపట్టగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న 46 మందిపై సత్యనారాయణపురం పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. సమస్యలు చెప్పేందుకు వచ్చిన ఉద్యోగులపై కేసులు నమోదు చేయడం ద్వారా ప్రభుత్వం వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హామీలు అమలు చేయరు.. ప్రశ్నిస్తే కేసులా?
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ పని భారం, విధులు, సేవా సంబంధిత సమస్యలపై కొంతకాలంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. పరిష్కారం కోసం ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చి రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడకు వచ్చిన ఉద్యోగులపై పోలీసుల వ్యవహారశైలి తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తమ న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలని కోరిన ఉద్యోగులపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
ఉద్యోగులపై కేసులు ఎత్తివేసి.. సమస్యలు పరిష్కరించాలి
ఉద్యోగుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయడం సరికాదని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. శాంతియుతంగా తమ సమస్యలను చెప్పుకునే హక్కును గౌరవించి, 46 మంది ఉద్యోగులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించాలని కోరుతున్నారు. సమస్యలపై చర్చించకుండా కేసులు, పోలీసు చర్యలతో ఉద్యోగుల గొంతు నొక్కే విధానాన్ని విడనాడి, సచివాలయ ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని వారు కోరుతున్నారు.








