హైదరాబాద్ శంషాబాద్‌లో కలకలం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ ప్రయాణిస్తున్న క్యాబ్‌ను డ్రైవర్ అకస్మాత్తుగా నిర్మానుష్య ప్రాంతానికి మళ్లించి, ఆమెపై లైంగిక దాడికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బాధితురాలి వద్ద ఉన్న రూ.60 వేల నగదుతో కూడిన బ్యాగ్‌ను లాక్కొని అక్కడి నుంచి పరారైనట్లు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. గచ్చిబౌలికి చెందిన 35 ఏళ్ల మహిళ వ్యక్తిగత పనిపై రూ.60 వేల నగదును బ్యాగ్‌లో పెట్టుకుని ఆదివారం సాయంత్రం క్యాబ్‌లో బయలుదేరింది. తొండుపల్లి టోల్‌ప్లాజా దాటిన తర్వాత డ్రైవర్ ఒక్కసారిగా రూట్ మార్చి, కొత్వాల్‌గూడ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వాహనాన్ని తీసుకెళ్లినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అక్కడ డ్రైవర్ తనపై లైంగిక దాడికి యత్నించడంతో అప్రమత్తమైన ఆమె ధైర్యంగా కారు నుంచి బయటకు దిగి పెద్దగా కేకలు వేసింది. దీంతో డ్రైవర్ ఆమె వద్ద ఉన్న నగదు బ్యాగ్‌ను లాక్కొని అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటన మరోసారి మహిళల క్యాబ్ ప్రయాణ భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే మహిళలు క్యాబ్ ఎక్కే ముందే వాహనం నంబర్, డ్రైవర్ వివరాలను కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో షేర్ చేసుకోవడం, ప్రయాణ సమయంలో GPS లొకేషన్‌ను ఆన్‌లో ఉంచుకోవడం అవసరం. డ్రైవర్ నిర్ణీత మార్గం నుంచి వేరే దారిలోకి మళ్లిస్తే వెంటనే అప్రమత్తమై స్పందించాలి. ప్రమాదం లేదా అనుమానాస్పద పరిస్థితి ఎదురైతే వెంటనే డయల్ 112 కు సమాచారం ఇవ్వాలి. తెలంగాణ పోలీసుల HAWK-EYE యాప్‌లోని అత్యవసర సేవలను కూడా వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు అప్రమత్తతే అత్యంత కీలకం.








