2026 ఏషియన్ గేమ్స్‌లో భారత్ తొలి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. స్మృతి మంధాన 79 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. షఫాలీ వర్మ 48 పరుగులతో రాణించింది. చివర్లో రిచా ఘోష్ 22 బంతుల్లోనే అజేయంగా 49 పరుగులు చేసి భారత స్కోరును 200 పరుగులు దాటించింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. 15.4 ఓవర్లలోనే శ్రీలంక జట్టు 69 పరుగులకు ఆలౌట్ అయింది. దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా.. షఫాలీ వర్మ, శ్రీచరణి, శ్రేయాంక పాటిల్ తలో రెండు వికెట్లతో సత్తా చాటారు. దీంతో భారత్ 147 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఏషియన్ గేమ్స్‌లో మహిళల క్రికెట్ స్వర్ణాన్ని వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది. ఈ విజయంతో 2026 ఏషియన్ గేమ్స్‌లో భారత్ స్వర్ణ పతకాల ఖాతా తెరిచింది.








