కారులో లాక్.. ఊపిరాడక నాలుగేళ్ల చిన్నారి మృతి

కారులో లాక్.. ఊపిరాడక నాలుగేళ్ల చిన్నారి మృతి

Summarize with AI

కారులో ప్రమాదవశాత్తు లాక్ కావడంతో ఊపిరాడక నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. గ్రామ సర్పంచ్ నవీన్, ఐశ్వర్య దంపతులకు తన్వితశ్రీ (4), సురక్ష అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం స్కూలుకు సెలవు కావడంతో చిన్నారులు ఇంటి వద్ద ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో తన్వితశ్రీ ఇంటి వద్ద ఉన్న లాక్ చేయని కారులోకి ఎక్కింది.

చిన్నారి కారు లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే కారు లాక్ అయింది. బయటకు రాలేకపోవడంతో ఊపిరాడక తన్వితశ్రీ స్పృహ కోల్పోయింది. కొంతసేపటి తర్వాత కూతురు కనిపించకపోవడంతో తల్లి ఐశ్వర్య ఆందోళనకు గురై చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు.

స్థానికులు కూడా చిన్నారి కోసం గ్రామంలో వెతికారు. ఈ క్రమంలో కారులో చిన్నారి ఉండొచ్చని అనుమానించి పరిశీలించగా.. తన్వితశ్రీ కారులో స్పృహ తప్పి పడిపోయి కనిపించింది. వెంటనే స్థానికులు చిన్నారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నాలుగేళ్ల చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో వినోభానగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment