ప్రముఖ యూట్యూబర్ నందూస్ వరల్డ్ (Nandoos World) (రమా నందన)(Rama Nandana) వీసా స్కామ్ (Visa Scam) కేసు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో(Ibrahimpatnam Police Station)నందూస్ వరల్డ్ కుటుంబం బాధితులు వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. అయితే.. ఇటీవల నాలుగు గంటల పాటు విచారించి ఆమెను ఇంటికి పంపించేసిన పోలీసులు.. తాజాగా గడువు కంటే ఒక రోజు ముందే ఆమెను పీఎస్‌లో విచారించడం సంచలనంగా మారింది.
వీసా స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రమానందన గుట్టుచప్పుడు కాకుండా (Secretly) ఇబ్రహీంపట్నం పోలీసుల విచారణకు హాజరయ్యారు. వాస్తవానికి రేపు పోలీస్ స్టేషన్‌కు హాజరుకావాల్సి ఉండగా.. ఒకరోజు ముందుగానే ఆమె విచారణకు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
రమానందన పోలీస్ స్టేషన్‌కు వచ్చిన విషయం బాధితులు, మీడియాకు (Media) తెలియకుండా పోలీసులు గోప్యంగా ఉంచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె విచారణకు హాజరైన సమయంలో బాధితులు ఎవరూ అక్కడ లేకుండా, మీడియా కంట పడకుండా పోలీసులు సహకరించారన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
కేవలం 30 నిమిషాల విచారణ?
రేపు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యేందుకు బాధితులు సిద్ధమవుతున్నారు. తమకు జరిగిన నష్టంపై పోలీసులకు వివరాలు అందించేందుకు వారు రానున్న నేపథ్యంలో ఒక్కరోజు ముందుగానే రమానందనను పోలీసులు కేవలం 30 నిమిషాల పాటు మాత్రమే విచారించి పంపించేశారని సమాచారం. తమపై జారీ చేసిన లుక్‌అవుట్ నోటీసులను (Lookout Notices) వెనక్కి తీసుకోవాలని రమానందన పోలీసులను కోరినట్లుగా తెలుస్తోంది.
పోలీసుల తీరుపై ప్రశ్నలు
రమానందన రేపు విచారణకు రావాల్సి ఉండగా.. ఒక్కరోజు ముందుగానే ఎందుకు హాజరయ్యారు? ఆమెను ముందుగానే విచారణకు అనుమతించింది ఎవరు? విచారణకు సంబంధించిన సమాచారాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారు? కేవలం 30 నిమిషాల్లోనే విచారణను ఎలా పూర్తి చేశారు? లుక్‌అవుట్ నోటీసులపై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? వంటి ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.
మరోవైపు బాధితులు మాత్రం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కేసు దర్యాప్తు పారదర్శకంగా సాగాలని, నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రమానందన ముందుగానే విచారణకు హాజరైన వ్యవహారంపై వస్తున్న అనుమానాలు, పోలీసుల తీరుపై వస్తున్న విమర్శలకు అధికారులు ఎలాంటి వివరణ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.







