తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) వద్ద విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసులతో(Women Police) దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి టి. హరీశ్‌రావు(T. Harish Rao) సహా నలుగురు నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గేట్ నంబర్ 3 వద్ద మహిళా కానిస్టేబుళ్లు భద్రతా విధుల్లో ఉన్నారు. అదే సమయంలో కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు నల్ల టీ-షర్టులు, ప్లకార్డులతో అక్కడికి చేరుకున్నారని పోలీసులు తెలిపారు.
రాజకీయ నినాదాలతో ఉన్న టీ-షర్టులు, ప్లకార్డులు వంటి వాటిని అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించబోమని పోలీసులు చెప్పిన సమయంలో వివాదం తలెత్తినట్లు మహిళా కానిస్టేబుల్ (Woman Constable) తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల ఆంక్షలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తూ తమను దుర్భాషలాడారని మహిళా కానిస్టేబుల్ ఆరోపించారు. కేటీఆర్, హరీశ్‌రావు తమను అవమానకర రీతిలో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
హరీశ్‌రావు తన టీ-షర్టును విప్పి ఓ పోలీసు అధికారిపైకి విసిరారని, మహిళా పోలీసు సిబ్బంది సమక్షంలో అర్ధనగ్నంగా(Half-Naked) నిలబడ్డారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి(Naveen Reddy), ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి (Sudheer Reddy) కూడా ఇదే విధంగా ప్రవర్తించి తమకు ఇబ్బంది కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు ఆధారంగా సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం తదితర ఆరోపణలకు సంబంధించిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ల (BNS Sections) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.








