దారుణం.. మెతుకుల కోసం విద్యార్థుల‌ వెతుకులాట

దారుణం.. మెతుకుల కోసం విద్యార్థుల‌ వెతుకులాట

Summarize with AI

ఏపీలో(Andhra Pradesh) ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై (Mid-Day Meal) విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. క‌డ‌ప జిల్లాలో(Kadapa District) ఒక షాకింగ్ ఘ‌ట‌న బ‌య‌ట‌ప‌డింది. లింగాల మండలంలోని ఓ జిల్లా పరిషత్‌ పాఠశాలలో(Zilla Parishad School) విద్యార్థులకు సరిపడా భోజనం అందక ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో (Social Media)వైరల్‌గా మారాయి. కొద్దిపాటి ఆహారం సరిపోకపోవడంతో విద్యార్థులు పాత్రల్లో అడుగున మిగిలిన మెతుకుల కోసం వెతుక్కుంటున్న దృశ్యాలు హృద‌యాల‌ను క‌ల‌చివేస్తున్నాయి.

ప్ర‌భుత్వ పాఠశాల విద్యార్థుల కోసం సెంట్రల్‌ కిచెన్‌(Central Kitchen) నుంచి పంపిన మధ్యాహ్న భోజనం సరిపోలేదు. అర్ధాక‌లితో చిన్నారులు చివరకు పాత్రల్లో మిగిలిన ఆహారాన్ని తీసుకునేందుకు ప్రయత్నించినట్లు వైరల్‌ అవుతున్న దృశ్యాలు చూపిస్తున్నాయి. విద్యార్థులకు కడుపునిండా భోజనం అందాల్సిన చోట ఇలాంటి పరిస్థితులు నెలకొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

‘నిన్న మిగిలిందని.. తక్కువ పంపాం’
ఈ ఘటనపై అధికారులు ఇచ్చిన వివరణ కూడా చర్చనీయాంశంగా మారింది. నిన్న‌ ఆహారం మిగిలిపోవడంతో ఈ రోజు తక్కువ మొత్తంలో భోజనం పంపించామని ఎంఈవో(MEO) చెప్ప‌డం ఆశ్చ‌ర్యంగా ఉందంటున్నారు విద్యార్థుల త‌ల్లిదండ్రులు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రతిరోజూ సరిపడా ఆహారం అందేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని ప్ర‌శ్నిస్తున్నారు. ఒక్కరోజు ఆహారం మిగిలిందనే కారణంతో మరుసటి రోజు విద్యార్థులను ప‌స్తులుంచుతారా..? అని నిల‌దీస్తున్నారు.

‘రోజుకో మెనూ’ ఎక్కడ?
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఇలాంటి దృశ్యాలు కనిపించడం లేదు. గోడ‌లు కూలి విద్యార్థులు చ‌నిపోవ‌డం, ఎక్స్‌ప‌యిర్ అయిన మ‌లేరియా మాత్ర‌లు మింగి విద్యార్థులు చ‌నిపోవ‌డం, ఆహారం తిని విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డం వంటి ఘ‌ట‌న‌లు రాష్ట్రంలో రోజుకో చోట చోటుచేసుకుంటున్నాయ‌ని గుర్తుచేస్తున్నారు.

మంత్రి నారా లోకేశ్‌(Nara Lokesh) విద్యా వ్యవస్థలో వేదిక‌ల‌పై గొప్ప‌లు చెప్పుకుంటున్నా.. ఆయన శాఖ పరిధిలో విద్యార్థులకు కనీసం కడుపునిండా మధ్యాహ్న భోజనం అందని పరిస్థితులు సంచ‌ల‌నంగా మారాయి. అర్ధాక‌లితో చిన్నారులు ఆహారం కోసం అల‌మ‌టిస్తున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment