తెలంగాణ అసెంబ్లీ సమావేశాల (Telangana Assembly Sessions) తొలిరోజే అధికార కాంగ్రెస్(Congress), ప్రతిపక్ష బీఆర్‌ఎస్(BRS) మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ హామీల (Government Promises) అమలును డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు(MLAs), ఎమ్మెల్సీలు(MLCs) నల్ల టీషర్టులు (Black T-Shirts) ధరించి అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే నల్ల టీషర్టులతో సభలోకి అనుమతించలేమని పోలీసులు స్పష్టం చేయడంతో వివాదం మొదలైంది. టీషర్టులు మార్చుకుని సభలోకి వెళ్లాలని పోలీసులు సూచించినప్పటికీ బీఆర్‌ఎస్ నేతలు నిరసన కొనసాగిస్తూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు, బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) నుదుటిపై, చేతికి గాయాలయ్యాయి. మరో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి(Jagdish Reddy) కూడా కాలికి గాయం అయినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. అనంతరం పోలీసులు పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్‌కు తరలించారు.
మరోవైపు హైదరాబాద్‌లోని(Hyderabad) పబ్లిక్ గార్డెన్స్(Public Gardens) వద్ద కూడా ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టడంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) టీషర్ట్ విప్పి బనియన్‌తో పబ్లిక్ గార్డెన్స్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, సంజయ్‌రావుతో పాటు పలువురిని కూడా పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి తరలించారు. రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలో తరలించారు.
ఈ ఘటనపై బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు (BRS Women MLAs) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ గేటు వద్ద తమతో పోలీసులు వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉందని ఆరోపిస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ అంశాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అయితే పోలీసులు మాత్రం స్పీకర్ ఆదేశాల మేరకే చర్యలు తీసుకున్నామని తెలిపారు. నల్ల టీషర్టులతో అసెంబ్లీలోకి అనుమతించకూడదని ఆదేశాలు ఉండటంతో వాటిని మార్చుకోవాలని సూచించామని, నిరసన కొనసాగించడంతో బీఆర్‌ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నామని డీసీపీ(DCP) శిల్పవల్లి(Shilpavalli) వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలోనే చోటుచేసుకున్న ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.








