‘రేవంత్ బ్లాక్‌మెయిల్ వ‌ల్లే న‌న్ను తొల‌గించారు’

‘రేవంత్ బ్లాక్‌మెయిల్ వ‌ల్లే న‌న్ను తొల‌గించారు’

Summarize with AI

మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. మీడియా ముందుకు వ‌చ్చిన ఆమె సీఎం రేవంత్ రెడ్డిపై, ప్ర‌భుత్వ ప‌నితీరుపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏఐసీసీకి తనను తొలగించడం ఇష్టం లేదని, సీఎం రేవంత్‌రెడ్డి పట్టుబట్టడంతోనే తనపై చర్యలు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. తాను కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని, ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.

‘‘మీరు తొలగిస్తారా.. నన్ను వెళ్లమంటారా?’’ అని సీఎం బ్లాక్‌మెయిల్ బెదిరింపుల వ‌ల్లే త‌న‌ను తొల‌గించార‌న్నారు. తనను మంత్రి ప‌ద‌వి నుంచి తొలగించే ముందు కనీసం ఒక్క మాటైనా అడిగి ఉంటే.. ఎందుకు తొలగిస్తున్నారనే ప్రశ్న వేసే అవకాశం తనకు దక్కేదని అన్నారు. అయితే తన అభిప్రాయం తీసుకోకుండానే నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.

త‌న కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేసి మంత్రి పదవి నుంచి తొలగించడం ఏమిటని కొండా సురేఖ ప్రశ్నించారు. గతంలో పలువురు కాంగ్రెస్‌ నాయకులు పార్టీకి, అగ్రనేతలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సందర్భాలను ఆమె ప్రస్తావించారు. మల్లు రవి గతంలో కాంగ్రెస్‌ను విమర్శించలేదా? రోశయ్య ఇందిరాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదా? జైపాల్‌రెడ్డి ఇందిరాగాంధీని దూషించలేదా? అని ప్రశ్నించారు. అలాంటి సందర్భాల్లో చర్యలు తీసుకోలేదని, తన కుమార్తె వ్యాఖ్యలకు మాత్రం తనను బాధ్యురాలిని చేశారని అన్నారు.

తన మంత్రి పదవి పోయినందుకు ఎలాంటి బాధ లేదని కొండా సురేఖ స్పష్టం చేశారు. ‘‘మంత్రి పదవి మాకు ఆభరణం మాత్రమే. అది లేనంత మాత్రాన మాకు నష్టం లేదు’’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో తమ కాళ్లు మొక్కి తమను గెలిపించాలని కోరినవారే ఇప్పుడు తమను విమర్శిస్తున్నారని అన్నారు. తమకు ప్రజాబలం ఉందని, తమను ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ తీరుపై మంత్రులు, ఎమ్మెల్యేలు సంతోషంగా లేరని కొండా సురేఖ ఆరోపించారు. ‘‘ఈ రోజు నాకు వచ్చింది.. రేపు మీకు వస్తుంది. బయటకు వచ్చి మాట్లాడండి’’ అంటూ కాంగ్రెస్‌ నేతలకు పరోక్షంగా పిలుపునిచ్చారు. ప్రభుత్వంలో పనులు జరగడం లేదని, కేవలం పిటిషన్లు తీసుకోవడం తప్ప పెద్దగా పనులు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు.

ఒక మహిళా మంత్రిని తొలగించడం జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీకి నష్టమని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. తనను తొలగించిన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని తాను అడగబోనని స్పష్టం చేశారు. యాదాద్రి ఆలయ కమిటీ విషయంలోనూ నిర్ణయం అందరితో చర్చించలేదని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వైఎస్సార్‌ తరహా కమ్యూనికేషన్‌ లేదని వ్యాఖ్యానించారు.

‘‘వైఎస్సార్‌ ప్రజలతో, నాయకులతో సన్నిహితంగా ఉండేవారు. ప్రజలతో, నేతలతో వైఎస్సార్‌కు ఉన్న కమ్యూనికేషన్‌ రేవంత్‌రెడ్డికి లేదు’’ అని కొండా సురేఖ విమర్శించారు. మంత్రి పదవి కోల్పోయిన నేపథ్యంలో కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి. ఆమె కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేయడంతో.. తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment