‘టెట్ రద్దు చేస్తావా? రాజీనామా చేస్తావా లోకేశ్..?’

‘టెట్ రద్దు చేస్తావా? రాజీనామా చేస్తావా లోకేశ్..?’

Summarize with AI

కూట‌మి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఇప్ప‌టికే ప్ర‌భుత్వ ఉద్యోగులు ఉద్య‌మ బాట ప‌ట్ట‌గా, తాజాగా గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్స్ ఆందోళ‌న‌ను ఉధృతం చేశారు. ఇన్‌సర్వీస్‌ టీచర్లకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ యునైటెడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (UTF) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళగిరిలో పెద్ద ఎత్తున‌ ఆందోళన చేపట్టారు. విద్యా భవన్‌ ముట్టడికి పిలుపునివ్వడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు తరలివచ్చారు.

ఆందోళనలో పాల్గొన్న ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘టెట్‌ రద్దు చేస్తావా? లోకేశ్ రాజీనామా చేస్తావా?’ అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. విద్యా భవన్‌ వైపు వెళ్లకుండా పోలీసులు ఉపాధ్యాయులను అడ్డుకొని పలువురిని బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీసు వాహనాల్లో తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఉపాధ్యాయులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన కొనసాగించారు.

ఇన్‌సర్వీస్‌ టీచర్లందరికీ టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని UTF డిమాండ్‌ చేస్తోంది. అంతేకాకుండా ఇన్‌సర్వీస్‌ టీచర్లందరికీ ఒకే విధమైన క్వాలిఫైయింగ్‌ మార్కులు ఉండాలని కోరుతోంది. టీచర్లు బోధించే సబ్జెక్టులోనే పరీక్ష రాసే విధానం అమలు చేయాలని, టెట్‌ను ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఉపాధ్యాయ సంఘం నేతలు పేర్కొన్నారు. విద్యా భవన్‌ ముట్టడిని అడ్డుకునే క్రమంలో ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించినట్లు ఆందోళనకారులు చెబుతున్నారు.

ఉపాధ్యాయుల ఆందోళన, పోలీసుల చర్యలతో మంగళగిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇప్ప‌టికే డీఎస్సీలో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని డీఎస్సీ అభ్య‌ర్థులు వివిధ రూపాల్లో ఆందోళ‌న చేస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల‌ని, సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఇన్‌స‌ర్వీస్ టీచ‌ర్లంద‌రికీ టెట్ నిర్వాహ‌ణ‌పై ఉపాధ్యాయ రంగం కూడా ఆందోళ‌న చేస్తోంది.

మ‌రోవైపు ప్ర‌భుత్వ ఉద్యోగులు త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని, ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను త‌క్ష‌ణ‌మే అమ‌లు చేయాల‌న్న డిమాండ్‌తో ఉద్య‌మం చేప‌ట్టారు. ప్ర‌భుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్ర‌భుత్వంపై మూకుమ్మ‌డిగా తిరుగుబాటు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment