పాడెపైనే తమ్ముడికి రాఖీ క‌ట్టిన అక్క‌

పాడెపైనే తమ్ముడికి రాఖీ క‌ట్టిన అక్క‌

Summarize with AI

రాఖీ పండుగకు రెండు రోజుల ముందు మహబూబాబాద్ జిల్లాలో(Mahabubabad district) చోటుచేసుకున్న ఓ విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. తమ్ముడికి రాఖీ (Rakhi) కట్టి సోదరబంధాన్ని చాటుకోవాలని ఎదురుచూసిన అక్కకు.. ఊహించని విధంగా అంతిమయాత్రలోనే తమ్ముడికి రాఖీ కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది.

కురవి మండల కేంద్రానికి(Kuravi mandal headquarters) చెందిన మోటపోతుల రమేష్ (Motapothula Ramesh) (36) అనారోగ్యంతో మృతి చెందాడు(Passed Away). ఆయన మృతదేహాన్ని అంతిమయాత్రలో భాగంగా దింపుడుకళ్లం వద్దకు తీసుకెళ్లిన సమయంలో రమేష్ అక్క అక్కడికి చేరుకుంది. పాడెపై ఉన్న తమ్ముడి మృతదేహాన్ని చూసిన ఆమె గుండెలవిసేలా రోదించింది.

“మరో రెండు రోజుల్లో నీకు రాఖీ కడదామనుకున్నా.. ఇంతలోనే మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా తమ్ముడా” అంటూ ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. అనంతరం తమ్ముడి మృతదేహానికి రాఖీ కట్టింది. ఆనందంగా జరుపుకోవాల్సిన రక్షాబంధన్ వేడుక (Raksha Bandhan celebration) ఇలా అంతిమయాత్రలో విషాదంగా మారడంతో అక్కడున్న బంధువులు, స్థానికులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

రమేష్ కుటుంబంలో ఇప్పటికే వరుస విషాదాలు చోటుచేసుకున్నట్లు బంధువులు తెలిపారు. కేవలం పది రోజుల క్రితమే రమేష్ తండ్రి మృతి చెందారు. ఆయన దశదినకర్మ ఈరోజు నిర్వహించాల్సి ఉండగా.. ఇంతలోనే రమేష్ కూడా మృతి చెందడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.

గతంలో రమేష్ తమ్ముడు కూడా అనారోగ్యంతోనే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఒకే కుటుంబంలో వరుసగా చోటుచేసుకున్న మరణాలతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రాఖీ పండుగ సందర్భంగా తమ్ముడి చేతికి రాఖీ కట్టాలని ఆశించిన అక్కకు.. చివరకు తమ్ముడి పాడెపైనే రాఖీ కట్టాల్సి రావడం అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment