ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా, అత్యాధునిక జీవనశైలికి పేరుగాంచిన సింగపూర్ (Singapore) ప్రస్తుతం జనాభా పరంగా తీవ్ర సవాలును ఎదుర్కొంటోంది. దేశంలో జననాల రేటు రికార్డు స్థాయికి పడిపోవడంతో.. యువతను (Youth) పిల్లలను కనేందుకు (Having Children) ప్రోత్సహించేందుకు ప్రభుత్వం (Government) భారీ ఆర్థిక ప్రోత్సాహకాలను(Financial Incentives) ప్రకటిస్తోంది. ఒకప్పుడు జనాభా నియంత్రణ కోసం ‘ఇద్దరు చాలు’ అనే నినాదాన్ని ప్రచారం చేసిన సింగపూర్.. ఇప్పుడు కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలను కనాలని వేడుకునే పరిస్థితి నెలకొంది.
జననాల రేటును (Birth Rate) పెంచడమే లక్ష్యంగా సింగపూర్ ప్రభుత్వం ప్రకటించిన ఫ్యామిలీ సపోర్ట్ ప్యాకేజీ (Family Support Package) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పథకం ప్రకారం సింగపూర్లో పుట్టే ప్రతి బిడ్డకు 17 ఏళ్ల వయసు వచ్చే వరకు వివిధ పథకాల రూపంలో కలిపి సుమారు 70,000 సింగపూర్ డాలర్ల వరకు ఆర్థిక ప్రయోజనాలు అందనుంది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.55 లక్షలకు సమానం.
ఈ ఆర్థిక సహాయాన్ని ఒకేసారి కాకుండా.. పిల్లల పెంపకం(Child Rearing), విద్య(Education), కుటుంబ అవసరాలకు (Family Needs) అనుగుణంగా వివిధ దశల్లో అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పిల్లలను పెంచే కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడం, యువ దంపతులను కుటుంబాలను ప్రారంభించేలా ప్రోత్సహించడం ఈ ప్యాకేజీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
సింగపూర్లో సంతానోత్పత్తి రేటు (Fertility Rate) కేవలం 0.87కి పడిపోవడం ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. జనాభా స్థిరంగా కొనసాగేందుకు అవసరమైన స్థాయి కంటే ఇది చాలా తక్కువ. ఇప్పటికే వృద్ధుల జనాభా పెరుగుతుండగా.. యువత సంఖ్య తగ్గడం భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థ, కార్మిక వనరులు, సామాజిక భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
సింగపూర్ ప్రధాని (Singapore Prime Minister) లారెన్స్ వాంగ్ (Lawrence Wong) జాతీయ దినోత్సవ ర్యాలీలో కుటుంబాలు, పిల్లల విషయంలో ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై కీలక ప్రకటన చేశారు. యువతకు కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతల మధ్య సమతుల్యత సాధించేలా మరిన్ని మద్దతు చర్యలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.
సింగపూర్ ప్రభుత్వం గతంలోనూ పిల్లలను కనాలనుకునే కుటుంబాలకు అనేక ప్రోత్సాహకాలు అందించింది. అయితే జీవన వ్యయం పెరగడం, ఇళ్ల ధరలు, ఉద్యోగ ఒత్తిడి, వివాహాల ఆలస్యం, పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చులు వంటి కారణాలతో యువతలో సంతానంపై ఆసక్తి ఆశించిన స్థాయిలో పెరగలేదు.
కొన్ని దశాబ్దాల క్రితం జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు సింగపూర్ ప్రభుత్వం ‘ఇద్దరు చాలు’(Two is Enough) అనే విధానాన్ని ప్రోత్సహించింది. అయితే కాలక్రమేణా దేశ జనాభా నిర్మాణం పూర్తిగా మారిపోయింది. తక్కువ జననాల రేటు, పెరుగుతున్న వృద్ధ జనాభా నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం జననాలను పెంచేందుకు ప్రత్యేక విధానాలను అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రూ.55 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలు, కుటుంబాలకు అదనపు మద్దతు వంటి చర్యలతో యువతలో పిల్లలను కనాలనే ఆసక్తిని పెంచేందుకు సింగపూర్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఈ భారీ ప్రోత్సాహకాలు దేశంలో జననాల రేటును గణనీయంగా పెంచుతాయా? లేక జీవనశైలి, ఆర్థిక పరిస్థితులు వంటి కారణాలు ఇంకా ప్రభావం చూపుతాయా? అన్నది రాబోయే కాలంలో తేలనుంది.








