కుటుంబ వివాదంపై తొలిసారి స్పందించిన మాజీ మంత్రి

కుటుంబ వివాదంపై తొలిసారి స్పందించిన మాజీ మంత్రి

Summarize with AI

మాజీ మంత్రి జోగి ర‌మేష్ కుటుంబ విష‌యాన్ని టీడీపీ అనుకూల మీడియా ర‌చ్చ‌కీడ్చి, సోష‌ల్ మీడియాలో చిలువ‌లు ప‌లువ‌లు చేసింది. కుటుంబ వివాదం నేపథ్యంలో తనపై, తన కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలు, సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి జోగి రమేష్ తొలిసారి మీడియా ముందుకు వ‌చ్చారు. త‌న కుటుంబ వ్య‌వ‌హారాన్ని రాజ‌కీయాల‌కు తెలుగుదేశం పార్టీ వాడుకుంటోంద‌ని మండిప‌డ్డారు.

తన బాధ్యతగా కుమారుడు రాజీవ్‌కు ఘనంగా వివాహం చేశానని జోగి రమేష్ తెలిపారు. పెళ్లి అనంతరం రాజీవ్‌, మేఘన మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని, వారిద్దరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులంతా సఖ్యత కోసం ప్రయత్నించారని చెప్పారు. అయితే విభేదాలు మరింత పెరగడంతో రాజీవ్‌ డైవర్స్‌ పిటిషన్‌ దాఖలు చేశారని వెల్లడించారు.

తన కుటుంబంపై కోడ‌లు మేఘన ఫిర్యాదు చేశారని, దాని ఆధారంగా తమ కుటుంబంలోని 11 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని జోగి రమేష్ పేర్కొన్నారు. తన కోడలు మేఘన కూడా తన కూతురితో సమానమేనని అన్నారు. తమ కుటుంబాన్ని మానసికంగా క్షోభకు గురిచేసేలా దుష్ప్రచారం చేస్తున్నారని జోగి రమేష్ ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్‌లో మతమార్పిడి అంటూ ప్రస్తావించడం దారుణ‌మ‌న్నారు.

ఫేక్‌ వీడియోలు, ఆడియోలు సృష్టించి తమ కుటుంబంపై ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గత నెల రోజులుగా తమపై AI వీడియోలు తయారు చేసి సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఐటీడీపీ ఎక్స్‌ హ్యాండిల్‌లో కూడా తనపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని రాజకీయ కుట్రగా జోగి రమేష్ అభివర్ణించారు. బీసీ నేతలను అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా? అని ప్రశ్నించారు.

తమ కుటుంబాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇన్ని కుట్రలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాష్ట్రంలో మరే సమస్యలు లేవా? నారా లోకేష్‌ అంటూ ఆయన విమర్శించారు. తాను ఎప్పుడూ తప్పు చేయనని జోగి రమేష్ స్పష్టం చేశారు. తనపై, తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలు, ప్రచారాన్ని చట్టపరంగా, రాజకీయంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యం తనకు ఉందని ఆయన పేర్కొన్నారు.

కుటుంబ వివాదం నేపథ్యంలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌, టీడీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టులు, టీడీపీ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రస్తుతం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment