పల్నాడులో ప్రేమోన్మాది.. యువ‌తిని చంపి పెట్రోల్ పోసి నిప్పు

పల్నాడులో ప్రేమోన్మాది.. యువ‌తిని చంపి పెట్రోల్ పోసి నిప్పు

Summarize with AI

ఉద్యోగంలో చేరిన త‌రువాత త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప్రేయ‌సిపై అనుమానంతో నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకెళ్లి హ‌త్య చేసి, ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ ఘ‌ట‌న ప‌ల్నాడు జిల్లా కారంపూడి మండ‌లంలో చోటుచేసుకుంది. కారంపూడి మండలం ఇనుపరాజుపల్లి కాలువ కట్ట వద్ద ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. హసీనా అనే యువతిని బాలసైదులు ప్రేమించాడు. అయితే హసీనా ఉద్యోగంలో చేరిన తర్వాత తనను పట్టించుకోవడం లేదనే అనుమానం బాలసైదులులో పెరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమెపై కక్ష పెంచుకున్న అతడు దారుణానికి పాల్పడ్డాడు.

కాలువ కట్ట వద్ద హసీనాపై కత్తితో దాడి చేసి హత్య చేసిన అనంతరం, మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు సమాచారం. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు హసీనా కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఇనుపరాజుపల్లి కాలువ కట్ట వద్ద సగం కాలిపోయిన స్థితిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానితుడు బాలసైదులును అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో తానే హసీనాను హత్య చేసినట్లు బాలసైదులు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రేమ పేరుతో యువతిపై కక్ష పెంచుకుని హత్యకు పాల్పడటంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment