సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జీ. ఈశ్వరయ్య గుండెపోటుకు గురయ్యారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్లు సీపీఐ నేతలు వెల్లడించారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం విజయవాడలోని కళాక్షేత్రం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరయ్య పాల్గొని మీడియాతో మాట్లాడారు. అప్పటికే ఆయన కొంత అస్వస్థతతో ఉన్నట్లు పార్టీ నేతలు తెలిపారు.
ర్యాలీ అనంతరం ఈశ్వరయ్య అస్వస్థతకు గురికావడంతో వెంటనే విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు యాంజియోగ్రామ్ నిర్వహించగా.. గుండెలో రెండు బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించారు. ఈశ్వరయ్యకు గతంలో హైదరాబాద్‌లోని సిటీ ఆస్పత్రిలో స్టెంట్లు వేసినట్లు సీపీఐ నేతలు తెలిపారు. విజయవాడలో ప్రాథమిక చికిత్స అనంతరం ప్రత్యేక అంబులెన్స్‌లో ఆయనను హైదరాబాద్‌కు తరలించారు.
వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన జీ. ఈశ్వరయ్య విద్యార్థి ఉద్యమాల ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్‌లలో జాతీయ స్థాయిలో వివిధ బాధ్యతలు నిర్వహించారు. అనంతరం సీపీఐలో అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను చేపట్టారు. ఉద్యమ నాయకుడిగా గుర్తింపు పొందిన ఈశ్వరయ్య త్వరగా కోలుకోవాలని సీపీఐ శ్రేణులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.








