హైదరాబాద్‌లో నకిలీ ఫైర్ ఎన్ఓసీల వ్యవహారం సంచలనం రేపుతోంది. హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (NOC) రూపొందించి ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై కేసు నమోదైంది.
అధికారుల సమాచారం ప్రకారం.. ఈ కాలేజీలు హైడ్రా కమిషనర్ సంతకాన్ని నకిలీ చేసి ఫైర్ ఎన్ఓసీలను సిద్ధం చేసి గుర్తింపు ప్రక్రియలో ఉపయోగించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయా కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని సంబంధిత అధికారులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా లేక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యాసంస్థల్లో మెహదీపట్నంలోని ప్రియాంకా జూనియర్ కాలేజ్, విద్యానగర్‌లోని మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, చంద్రాయణగుట్టలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, చిక్కడపల్లిలోని న్యూ ఎరా జూనియర్ కాలేజ్, శివరాంపల్లిలోని షాహీర్ జూనియర్ కాలేజ్, తెల్లాపూర్‌లోని వశిష్ట జూనియర్ కాలేజ్, బర్కత్‌పురలోని హైందవి జూనియర్ కాలేజ్, ఎస్సార్ నగర్‌లోని రెసిడెన్స్ జూనియర్ కాలేజ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఇదే తరహాలో మరిన్ని అక్రమాలు జరిగి ఉండొచ్చన్న అనుమానంతో మరో 60 ప్రైవేట్ కాలేజీలు సమర్పించిన ఫైర్ ఎన్ఓసీలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. స్క్రూటినీ అనంతరం అవసరమైతే మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశముందని తెలుస్తోంది.
ఈ ఘటనతో ప్రైవేట్ విద్యాసంస్థల గుర్తింపు ప్రక్రియలో నకిలీ ధ్రువపత్రాల వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కేసు దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.








