ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)ను కాపాడుకునేందుకు ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ (JAC) తన ఆందోళనను మరింత తీవ్రతరం చేసింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వ హయాంలో (Government Tenure) ప్రభుత్వంలో విలీనమై, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొంది వేతనాలు అందుకున్న ఆర్టీసీ కార్మికులు (RTC Employees). ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సంస్థను దశలవారీగా ప్రైవేటీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శాంతియుతంగా నిర్వహిస్తున్న ఉద్యమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు (Nara Chandrababu Naidu) జేఏసీ నాయకులు వినతిపత్రాలు పంపించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 42 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల నుంచి సేకరించిన సంతకాల ప్రతులను ప్రభుత్వానికి అందజేసినట్లు ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ వై. శ్రీనివాసరావు (Y. Srinivasa Rao) వెల్లడించారు.
ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ప్రైవేట్ ఆపరేటర్లకు పగ్గాలు అప్పగించే ఆలోచనను మానుకోవాలని, కేంద్ర సబ్సిడీలను వినియోగించుకుని సంస్థ ద్వారానే వాటిని నిర్వహించాలని డిమాండ్ చేశారు. సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే 4,000 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని కోరారు.
ఉచిత ప్రయాణ పథకమైన ‘స్త్రీ శక్తి’ (Stree Shakti) రీయింబర్స్‌మెంట్ నిధులను (Reimbursement Funds) బకాయిలు లేకుండా ఆర్టీసీకి పూర్తిగా చెల్లించాలని స్పష్టం చేశారు. డిపోల భూములను ప్రైవేట్ సంస్థలకు లీజుకివ్వడం, దశలవారీగా ప్రైవేటీకరించే ప్రతిపాదనా పత్రాలను పక్కన పెట్టాలని డిమాండ్ చేశారు.
సంస్థలో తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా నెలకు దాదాపు 300 మంది ఆర్టీసీ సిబ్బంది అకాల మరణం చెందుతున్నారని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో మాట వరుసగా హామీలు ఇచ్చినా, అధికారికంగా లిఖితపూర్వక హామీ మాత్రం ఇవ్వలేదని, చర్చల డ్రాఫ్ట్‌లో మాట్లాడిన విషయాలకు, ఇచ్చిన పత్రాలకు తేడా ఉందని మండిపడ్డారు.
“ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఇప్పటివరకు శాంతియుతంగా నిరసనలు తెలియజేశాం. కానీ ప్రభుత్వం ఆర్టీసీని, కార్మిక సంఘాలను, ప్రజలను పక్కదోవ పట్టించాలని చూస్తే ఊరుకునేది లేదు. ప్రభుత్వం మా వినతులను పరిగణనలోకి తీసుకోకపోతే త్వరలోనే పూర్తిస్థాయి ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటిస్తాం” అని ఆర్టీసీ జేఏసీ హెచ్చరించింది.








