ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu) తీరుపై మాజీ సీబీఐ డైరెక్టర్ (CBI Director), రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావు (Nageswara Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పర్యటన ఏర్పాట్లలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న శైలి ఒక రాష్ట్రాధినేత స్థాయికి తగదని, సీఎం స్థాయిని ఆయన దిగజార్చుతున్నారని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా విమర్శించారు.
ప్రధాని పర్యటన ఏర్పాట్లలో చంద్రబాబు ప్రవర్తిస్తున్న తీరును తప్పుబడుతూ నాగేశ్వరరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా(CM) ఉన్న వ్యక్తి, ప్రధాని పర్యటనకు ఒక ఈవెంట్ మేనేజర్‌లా (Event Manager)మారిపోవడం, దాన్ని మళ్లీ గర్వంగా ప్రచారం చేసుకోవడం పతనావస్థకు నిదర్శనమని మండిపడ్డారు.
“నేను ఒడిశాలో (Odisha) జానకీ వల్లభ పట్నాయక్, బిజూ పట్నాయక్, హేమానంద బిస్వాల్, గిరిధర్ గమాంగో, నవీన్ పట్నాయక్ వంటి ఐదుగురు దిగ్గజ ముఖ్యమంత్రుల వద్ద సేవలందించాను. వారెప్పుడూ తమ హోదాను కాపాడుకుంటూనే ప్రధానిని ఒక సహచరుడిగా గౌరవించారు తప్ప, తమ పదవి రాజసాన్ని ఏనాడూ పలచన చేయలేదు” అని రిటైర్డ్ ఐపీఎస్ గుర్తుచేశారు.
గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా ప్రవర్తించలేదని, నారా చంద్రబాబు నాయుడు సీఎం స్థాయిని తీవ్రంగా దిగజార్చారని చురకలు అంటించారు.
భోగాపురం క్రెడిట్ రాజకీయంపై వైసీపీ ఆగ్రహం
మరోవైపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (Bhogapuram International Airport) ప్రారంభోత్సవ ఏర్పాట్లు, ప్రచారం చుట్టూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగుతోంది. వైసీపీ(YSRCP) సోషల్ మీడియా వేదికగా ఆధారాలను బయటపెడుతూ కూటమి ప్రభుత్వంపై (Alliance Government) విరుచుకుపడింది.
భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి 2700 ఎకరాల భూసేకరణతో (Land Acquisition) పాటు రూ.1200 కోట్ల నిధులు కేటాయించి, 85 శాతానికి పైగా నిర్మాణ పనులను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) ప్రభుత్వమే(Government) పూర్తి చేసిందని వైసీపీ(YSRCP) స్పష్టం చేసింది. జగన్ హయాంలో శరవేగంగా జరిగిన పనిని, తామే అంతా చేసినట్లుగా చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్ (Credit) కొట్టేసేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని ప్రతిపక్షం విమర్శిస్తోంది.
ప్రధాని రాకను పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం చేస్తున్న హడావుడి, దానికి వ్యతిరేకంగా మాజీ ఐపీఎస్ అధికారి వ్యాఖ్యలు, వైసీపీ ఆధారాలతో జరుపుతున్న దాడితో ఏపీ రాజకీయం తీవ్ర వేడెక్కింది.









