తన ఇంటిపై జరిగిన దారుణమైన దాడికి సంబంధించి మాజీ మంత్రి, వైసీపీ అంబటి రాంబాబు (Ambati Rambabu) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై (Pemmasani Chandrasekhar) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుంటూరులోని (Guntur) తన నివాసం, క్యాంపు కార్యాలయంపై జరిగిన దౌర్జన్యాన్ని, విధ్వంసాన్ని గుర్తుచేసుకొని తీవ్రంగా మండిపడిన అంబటి.. ఈ దాడి వెనుక పెమ్మసాని కుట్ర ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తన ఇంటిపై దాడి కాకతాళీయంగా జరిగింది కాదని, పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందని ఆరోపించారు. “24 గంటల్లో అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తామంటూ పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించినప్పుడే ఈ దాడి కుట్రకు బీజం పడింది. ఆయన చెప్పినట్లే దాడి చేసి, నన్ను అరెస్ట్ చేయించి 18 రోజుల పాటు జైలులో(Jail) ఉంచి ‘సినిమా'(Movie) చూపించారు. కానీ గుర్తుపెట్టుకోండి.. మీరు నాకు సినిమా చూపించారు, ఇప్పుడు మీకు భారతదేశపు చట్టాలు ఎంత పదునైనవో నేను చూపిస్తా” అని అంబటి రాంబాబు ఘాటుగా హెచ్చరించారు.
తన ఇంటిపై మారణాయుధాలతో విరుచుకుపడి, కుటుంబ సభ్యులను భయాందోళనకు గురిచేసి, వాహనాలను ధ్వంసం చేయడం తీవ్ర ఆటవిక చర్య అని మండిపడ్డారు. ఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నా పోలీసులు కనీసం ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే చాలు నెలల తరబడి జైలులో బంధిస్తున్న కూటమి ప్రభుత్వం.. ఇళ్లకు నిప్పుపెట్టే యత్నం చేసి, ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్లిన వాళ్లను ఎందుకు స్వేచ్ఛగా తిరగనిస్తోందని ప్రశ్నించారు.
అమెరికాలో (America) వేల కోట్లు సంపాదించినంత మాత్రాన, అధికారంలో ఉన్నామన్న అహంకారంతో చట్టం నుంచి తప్పించుకోలేరని పెమ్మసానిని ఉద్దేశించి విమర్శించారు. ఇలాంటి దారుణ రాజకీయాలకు ఒడిగట్టడం పెమ్మసానికేశ చెల్లిందని వ్యాఖ్యానించారు. తన ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై, దానికి సూత్రధారులుగా ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరిలోని (Mangalagiri) రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి వెళ్లి నేరుగా వినతిపత్రం అందజేస్తానని వెల్లడించారు.
తనపై దాడి చేసి, కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు తలపెట్టిన అసలు నిందితులను, వారికి అండగా ఉన్నవారిని అరెస్టు చేసేంత వరకు తమ పోరాటం ఆగదని అంబటి స్పష్టం చేశారు. చట్టపరంగా(Legally), ప్రజాక్షేత్రంలో న్యాయపోరాటం చేసి తీరుతానని, బెదిరింపులకు వైసీపీ(YSRCP) నేతలు భయపడేది లేదని ధ్వజమెత్తారు.








