గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తనపై, తన సేవా సంస్థపై జరుగుతున్న ప్రచారంపై ‘రా ఎన్టీఆర్’ (RAW NTR) వ్యవస్థాపకుడు సాయి రూప్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా ప్రకటించిన విధంగానే శనివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిరూప్ మాట్లాడుతూ.. ఈ వివాదాల వల్ల గత వారం రోజులుగా తాను మానసికంగా ఎంతో కృంగిపోయానని భావోద్వేగానికి లోనయ్యారు. నందమూరి అభిమానులకు ఏదైనా బాధ కలిగించి ఉంటే పెద్ద మనసుతో క్షమించాలని ఆయన కోరారు.
సమాజంలో మార్పు కోసం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ‘రా ఎన్టీఆర్’ సంస్థ తరఫున “ఊరు-వాడ” అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి తీసుకువెళ్తున్నట్లు సాయి రూప్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా మూడు విభాగాలుగా విభజించి సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
సేవతో యువ జాగృతి
సమాజంలో యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా, వారిలో చైతన్యం తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ప్రస్తుతం యువతను పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా గ్రామగ్రామాన విస్తృత అవగాహన సదస్సులు నిర్వహిస్తామని, యువతను సేవా మార్గం వైపు నడిపిస్తామని తెలిపారు.
మన ఊరు – మన బాధ్యత
గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్లో ఉండిపోయిన స్థానిక సమస్యలను గుర్తించి, ప్రజా భాగస్వామ్యంతో వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. అలాగే, దేశానికి వెన్నెముక అయిన రైతుల కోసం ప్రత్యేకంగా ‘రైతు సదస్సులు’ నిర్వహించి, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న ఇబ్బందులపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.
ఊరి మాట.. పాలకుల దాకా
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను, క్షేత్రస్థాయి ఇబ్బందులను ప్రభుత్వం, పాలకుల దృష్టికి తీసుకువెళ్లేలా ఒక బలమైన వేదికగా ఈ సంస్థ పని చేస్తుందని సాయి రూప్ వివరించారు.
రాజకీయాలకు, ఎన్నికలకు తమ సేవా సంస్థకు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పిన సాయి రూప్.. ఈ “ఊరు-వాడ” మహత్కార్యాన్ని మొదటి దశలో ఎన్టీఆర్ జిల్లా లోని ఒక్కొక్క గ్రామం నుంచి అధికారికంగా ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. తమపై వస్తున్న అసత్య ఆరోపణలను నమ్మవద్దని, సమాజ శ్రేయస్సు కోసం కదిలివస్తున్న యువతను, అభిమానులను ఆశీర్వదించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ తమను పిలిచి ఇవన్నీ వద్దు అని చెబితే వెంటనే ఒక టైట్ హగ్ ఇచ్చి వదిలేస్తామని ప్రకటించారు.








