కిర్లంపూడిలో ఉద్రిక్తత.. కూతురును అడ్డుకున్న ముద్ర‌గ‌డ‌ అనుచరులు

కిర్లంపూడిలో ఉద్రిక్తత.. కూతురును అడ్డుకున్న ముద్ర‌గ‌డ‌ అనుచరులు

Summarize with AI

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసం కిర్లంపూడిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముద్రగడ అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆస్ప‌త్రిలో నిన్న సాయంత్రం క‌న్నుమూశారు. హైద‌రాబాద్ నుంచి కిర్లంపూడికి ఆయ‌న భౌతిక కాయాన్ని ఇవాళ ఉద‌యం తీసుకువ‌చ్చారు. తండ్రి భౌతికకాయాన్ని చూసేందుకు ఆయన కుమార్తె క్రాంతి కిర్లంపూడికి చేరుకున్నారు. అయితే, ముద్రగడ అనుచరులు ఆమెను తీవ్రంగా ప్రతిఘటించారు. “గో బ్యాక్ క్రాంతి” అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఆమెను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.

తండ్రీకూతుళ్ల మధ్య గత విభేదాలు
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభం, ఆయన కుమార్తె క్రాంతి మధ్య తీవ్ర రాజకీయ, వ్యక్తిగత విభేదాలు తలెత్తాయి. క్రాంతి జనసేన పార్టీలో చేరి తండ్రికి వ్య‌తిరేకంగా విమ‌ర్శ‌లు చేశారు. దీంతో తనను మానసిక క్షోభకు గురిచేసిన కుమార్తె తీరుపై ముద్రగడ గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విభేదాల నేపథ్యంలోనే… “నేను చనిపోతే నా అంత్యక్రియలకు కూడా నా కూతురు రావొద్దు” అని ముద్రగడ పద్మనాభం అప్పట్లోనే తెగేసి చెప్పారు.

తండ్రి మరణవార్త విని కడచూపు కోసం కిర్లంపూడికి బయలుదేరగా.. మొదట పోలీసులు ఆమెను ప్రత్తిపాడు వద్దే అడ్డుకున్నారు. ముద్రగడ కుటుంబ సభ్యులు ఆమె రాకను నిరాకరిస్తున్నారని పోలీసులు స్పష్టం చేశారు. అయితే, తన తండ్రికి నివాళులు అర్పించేందుకు అవకాశం ఇవ్వాలని క్రాంతి పోలీసులను తీవ్రంగా విజ్ఞప్తి చేశారు.

ఆమె అభ్యర్థన మేర‌కు పోలీసులు అనుమ‌తించినా, కిర్లంపూడిలో ముద్రగడ అనుచరుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది. క‌నీసం పార్ధివ దేహం ఉన్న ఫ్రీడ్జ‌ర్‌ను కూడా ముద్ర‌గ‌డ భార్య, బంధువులు ముట్టుకోనివ్వ‌లేదు. క్రాంతి రాక‌పై త‌ల్లి కూడా అభ్యంత‌రం చెప్పారు. క్రాంతిని త‌న భ‌ర్త నుంచి దూరంగా తీసుకెళ్లాల‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు ఆమెను కిర్లంపూడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరారు.

ప్రస్తుతం కిర్లంపూడి శివారు ప్రాంతంలో వేచి చూస్తున్న క్రాంతిని పోలీసులు రాజ‌మండ్రి త‌ర‌లించారు. ముద్ర‌గ‌డ జీవించి ఉన్న స‌మ‌యంలో ప్ర‌త్య‌ర్థుల‌తో క‌లిసి కూతురు క్రాంతి తీవ్ర మాన‌సిక క్షోభ‌కు గురిచేసింద‌ని, చిన్నత‌నం నుంచి తండ్రి వ్య‌క్తిత్వం గురించి తెలిసిన కూతురే ఆయ‌నపై దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేసి, మాన‌సికంగా ఇబ్బందుల‌కు గురిచేసిందని ముద్ర‌గ‌డ అనుచ‌రులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment