రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అహోబిలం (Ahobilam) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (Lakshmi Narasimha Swamy) మరోసారి వార్తల్లో నిలిచింది. ఆలయ ఆదాయం తగ్గుతున్న నేపథ్యంలో, దేవస్థానం చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (సీఏవో) పార్థసారథి (Parthasarathi) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. గత రెండేళ్లలో రాజకీయ జోక్యం కారణంగా దేవస్థానానికి సుమారు రూ.5.5 కోట్ల నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు.
2023 మే నుంచి అహోబిలం దేవస్థానం శ్రీ అహోబిల మఠం ఆధ్వర్యంలో నిర్వహణలో ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 26(డి) (26(d), సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు ప్రకారం దేవస్థానం ఆస్తుల నిర్వహణ హక్కు మఠానికే ఉందని ఆయన తెలిపారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత రెండేళ్లలో తనకంటే ముందు ఐదుగురు సీఏవోలు మారడం, రాజకీయ ఒత్తిళ్లు, జోక్యం కారణంగా దేవస్థాన పరిపాలన దెబ్బతిందని, అదే కోట్ల రూపాయల నష్టానికి కారణమైందని పేర్కొన్నారు.
దేవస్థానానికి ప్రధాన ఆదాయ వనరుల్లో తలనీలాల వేలం (Human Hair Auction) ఒకటి. అయితే గత రెండేళ్లుగా చట్టబద్ధమైన టెండర్లు నిర్వహించలేకపోయామని పార్థసారథి తెలిపారు. గత ఏడాది రూ.1.5 కోట్లకు కాంట్రాక్ట్ ఇచ్చినా దేవస్థానానికి కేవలం రూ.50 లక్షలే వచ్చాయని, మరో రూ.1 కోటి బకాయిగా ఉందన్నారు. అంతకుముందు ఏడాది టెండర్ ప్రక్రియనే అడ్డుకున్నారని, సుమారు రూ.2 కోట్ల విలువైన తలనీలాలకు కేవలం రూ.23 లక్షలు మాత్రమే చెల్లించారని ఆరోపించారు.
టెండర్లు నిర్వహించేందుకు రెండుసార్లు ప్రయత్నించినా అడ్డంకులు ఎదురయ్యాయని పార్థసారథి (Parthasarathi) చెప్పారు. దీంతో పీఠాధిపతి అనుమతితో ప్రత్యామ్నాయ విధానంలో ఒక ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించామని తెలిపారు. ఈ ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఆళ్లగడ్డ మేజిస్ట్రేట్ కోర్టు (Magistrate Court) నుంచి 29 మందిపై ఇంజక్షన్ ఉత్తర్వులు కూడా పొందినట్లు వెల్లడించారు.
చట్టబద్ధమైన వే బిల్‌తో(Way Bill) తలనీలాల స్టాక్‌ను తరలిస్తుండగా సుమారు 100 మంది వచ్చి వాహనాలను అడ్డుకున్నారని పార్థసారథి ఆరోపించారు. తన కారు, సరుకు వాహనాల తాళాలు లాక్కోవడంతో పాటు తన నివాసాన్ని కూడా చుట్టుముట్టారని చెప్పారు. ఈ ఘటనపై నంద్యాల జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వగా, తలనీలాల తరలింపుకు భద్రత కల్పిస్తామని, తన వాహనాన్ని విడుదల చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

తాను దేవస్థానం తలనీలాలను దొంగిలించేందుకు ప్రయత్నించానంటూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పార్థసారథి ఖండించారు. ఆళ్లగడ్డలో అహోబిలం వ్యవహారంలో టీడీపీ-వైసీపీ మధ్య వార్ జరుగుతున్న సమయంలో పార్థసారథి చేసిన ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆరోపణలు, ప్రతిఆరోపణల మధ్య అహోబిలం దేవస్థానం పరిపాలన, తలనీలాల టెండర్ల వ్యవహారం ఇప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.









కొండా సురేఖ బర్తరఫ్‌పై స్పందించిన బీఆర్ఎస్