జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. మూసుకుపోతున్న దారులు

జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. మూసుకుపోతున్న దారులు

కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో దర్యాప్తు అడుగు ముందుకు పడటం లేదు. కేసు నమోదై ఇన్ని రోజులవుతున్నా చిన్నారి ఆచూకీపై పోలీసులు ఎలాంటి క్లూ సంపాదించ‌లేక‌పోయారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిఘా నేత్రాలు ఉన్నాయని చెప్పుకునే పోలీసులు.. ఒక చిన్నారి మిస్సింగ్ కేసును ఛేదించలేకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారంగా భావించిన పెంపుడు కుక్క మరణంపై పోలీసులు ఎలాంటి వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేదు. ఈ నెల 6వ తేదీన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన సమయంలో ఆమె వెంట వెళ్లిన పెంపుడు కుక్క.. ఈ నెల 13వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీనిపై స్పందించిన అధికారులు 14వ తేదీన ఎన్.సూరవరం పశువుల ఆసుపత్రిలో కుక్కకు పోస్ట్‌మార్టం నిర్వహించారు.

అనంతరం కుక్క శరీరం నుండి సేకరించిన కీలక నమూనాలను విశాఖపట్నంలోని రీజినల్ ల్యాబ్‌కు పంపించారు. మ‌రోవైపు కంటికి రెప్పలా చూసుకునే తమ కూతురు అదృశ్యమై ఇన్ని రోజులైనా క్లూ దొరక్కపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. బిడ్డ ఏమైపోయిందో, ఏ స్థితిలో ఉందో తెలియక, ఆమెపై బెంగ పెట్టుకుని తల్లి భవాని మంచం పట్టారు. కూతురు క్షేమంగా తిరిగి వస్తుందన్న నమ్మకం తల్లిదండ్రులలో రోజురోజుకూ సన్నగిల్లుతోంది.

రాష్ట్రంలో మహిళలకు, చిన్న పిల్లలకు రక్షణ కరువైందని స్థానికులు మండిప‌డుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ కేసుపై స్పందించి చిన్నారిని సురక్షితంగా రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment