గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కాంబినేషన్లో వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పెద్ది'(Peddi)బాక్సాఫీస్ రన్ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో గత వారం రోజులుగా మేకర్స్ ఊరిస్తున్న “అదనపు సన్నివేశాల” జోడింపు ఎట్టకేలకు ఇవాళ నుంచి థియేటర్లలో అందుబాటులోకి వచ్చాయి. మరి ఈ లాస్ట్ మినిట్ స్ట్రాటజీ సినిమా కలెక్షన్లకు ఏమైనా బూస్ట్ ఇస్తుందా? లేదా? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
థియేటర్లలో కొత్తగా యాడ్ చేసిన రన్‌టైమ్ మొత్తం 5 నిమిషాల 56 సెకన్లు. ఈ అదనపు సీన్లలో ప్రధానంగా రామ్ చరణ్ – జాన్వీ కపూర్ మధ్య సాగే కొన్ని క్రేజీ రొమాంటిక్ అండ్ లవ్ సీన్లు. జగపతిబాబు – రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చే కొన్ని కీలకమైన డ్రామా సీన్లు యాడ్ చేశారు. అయితే, ఈ కొత్త సీన్ల కోసం సెకండాఫ్‌లో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌కు సంబంధించిన కొన్ని సీన్లను ట్రిమ్ (Trim) చేసినట్లు తెలుస్తోంది.
రెండు వారాల థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకున్న ‘పెద్ది’ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.420 కోట్లలకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భారీ నంబరే అయినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. అమెరికా (USA) సహా ఇతర దేశాల్లో వసూళ్లు దారుణంగా పడిపోయాయి. థియేటర్లలో ఆక్యుపెన్సీ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఉత్తరాదిన సినిమా రన్ దాదాపు ముగింపు దశకు వచ్చేసింది.
టికెట్ రేట్లు ఇప్పటికే సాధారణ స్థాయికి రావడంతో, ఈ 6 నిమిషాల (6 Minutes) కొత్త కంటెంట్ కోసం హార్డ్ కోర్ (Hardcore) మెగా అభిమానులు థియేటర్లకు రెండోసారి వెళ్లే ఛాన్స్ ఉంది. కానీ, ఈ అదనపు సీన్ల వల్ల కొత్తగా సాధారణ ప్రేక్షకులు తరలివస్తారని గానీ, బాక్సాఫీస్ కలెక్షన్లు మళ్లీ భారీగా పుంజుకుంటాయని ఆశించడం అత్యాశే అంటున్నారు.







