రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే ప్రతి నాయకుడు ముందుగా తన సొంత బూత్‌లో మెజారిటీ సాధించే బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAలు), కార్యకర్తలు ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. అక్టోబర్ 1న విడుదలయ్యే ఫైనల్ ఓటర్ లిస్ట్ ఎంతో కీలకమని, ప్రతి ఓటు విలువైనదేనని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆగస్టు 30 వరకు కొత్త ఓట్ల నమోదు, మార్పులు-చేర్పులు, అభ్యంతరాలకు అవకాశం ఉందని గుర్తుచేసిన కేటీఆర్.. డూప్లికేట్, అక్రమ ఓట్ల తొలగింపుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఒకే వ్యక్తికి పలుచోట్ల ఓట్లు ఉండే అవకాశాన్ని ప్రస్తావిస్తూ అనుమానాస్పద ఓట్ల జాబితాను సిద్ధం చేసి పార్టీ నాయకత్వానికి అందించాలని సూచించారు. ఇందుకోసం ‘హ్యాండ్ బుక్’, ‘వర్క్ బుక్’లను అందజేస్తామని, ఇంటింటికీ వెళ్లి ఖచ్చితమైన సమాచారం సేకరించాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే ఎన్నికల్లో భారీ విజయం సాధ్యమవుతుందని కేటీఆర్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.








