కాకినాడ జిల్లా (Kakinada District) తుని మండలం సీహెచ్ అగ్రహారం (CH Agraharam) సమీపంలోని అటవీ ప్రాంతంలో (Forest Area) తప్పిపోయిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (Gnaneshwari) అదృశ్యం కేసులో (Missing Case) ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది. పాపతో పాటు అడవిలోకి వెళ్లి వచ్చిన పెంపుడు కుక్క (Pet Dog) శనివారం మధ్యాహ్నం అనూహ్యంగా మరణించింది. చిన్నారి ఆచూకీ తెలిసిన మూగజీవం ప్రాణాలు కోల్పోవడంతో ఈ అదృశ్యం కేసు చుట్టూ ఇప్పుడు మరిన్ని అనుమానాలు ముసురుకుంటున్నాయి.
ఈనెల 6వ తేదీన పామాయిల్ తోట కాపలాదారులైన గణేష్ (Ganesh), భవాని (Bhavani) దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి ఆడుకుంటూ తమ పెంపుడు కుక్కతో కలిసి అడవి వైపు వెళ్ళిపోయింది. పాపతో పాటే అదృశ్యమైన ఆ కుక్క, మూడు రోజుల తర్వాత ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చింది. అడవి నుంచి వచ్చినప్పటి నుండి ఆ కుక్క ప్రవర్తన అత్యంత వింతగా, హింసాత్మకంగా మారింది. చిన్నారి తల్లి భవానితో పాటు చుట్టుపక్కల మరికొందరిని కరవడానికి ప్రయత్నించింది.
కుక్క ప్రవర్తన తేడాగా ఉండటంతో అది మళ్లీ అడవిలోకి పారిపోయింది. అయితే, చిన్నారి ఆచూకీ ఆ కుక్కకు కచ్చితంగా తెలిసి ఉంటుందని పోలీసులు నమ్మారు. దీంతో అది రెండోసారి తిరిగి రాగానే అధికారులు దాన్ని చాకచక్యంగా బంధించారు. దాని మెడకు GPS Tracker అమర్చి అడవిలోకి వదిలారు. అది చిన్నారి ఉన్న చోటుకు తీసుకెళ్తుందని ఆశించినా.. అది అడవి వైపు వెళ్లకుండా కేవలం ఇంటి పరిసర ప్రాంతాల్లోనే తిరిగి మళ్లీ వెనక్కి వచ్చేసింది.
జీపీఎస్ ప్రయోగం విఫలమైన కొద్దిసేపటికే, ఆ పెంపుడు కుక్క శనివారం ఇంటి వద్దే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. కుక్క మరణంతో చిన్నారిని కనిపెట్టే ఒక కీలకమైన మార్గం మూసుకుపోయినట్లయింది. కుక్క మృతి వెనుక ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉండి ఉంటుందని గ్రామస్తులు, చిన్నారి బంధువులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి ఏడు రోజులు గడుస్తున్నా ఆచూకీ దొరకకపోవడం, నమ్ముకున్న పెంపుడు కుక్క కూడా కళ్లముందే చనిపోవడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణణాతీతంగా మారింది.








