ఎన్నికల వేళ ఓట్ల కోసం ఆకాశమే హద్దుగా హామీలిచ్చి(Promises), అధికారంలోకి వచ్చాక వాటిని మరుగునపర్చడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి (Nara Chandrababu Naidu) అలవాటేనన్న చర్చ మళ్లీ మొదలైంది. నిన్న తిరుపతి (Tirupati) వేదికగా జరిగిన ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ బహిరంగ సభలో చంద్రబాబు స్వయంగా మాట్లాడుతూ.. “ఆడబిడ్డ నిధి పథకం (Aadabidda Nidhi Scheme) హామీ ఇచ్చాం కానీ, అమలుకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి” అని ప్రకటించడంపై రాష్ట్రవ్యాప్తంగా మహిళా లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 2014-19 మధ్య పసుపు-కుంకుమ పథకం మాదిరిగానే.. ఈసారి ‘సూపర్-6’ (Super Six)హామీలలో అత్యంత కీలకమైన మొదటి హామీ ‘ఆడబిడ్డ నిధి’కి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడేసిందంటూ మండిపడుతున్నారు.

2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు ప్రతి ఇంటికీ వెళ్లి ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ’ (Babu Surety-Future Guarantee) పేరుతో బాండ్లు పంచారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు(Women) నెలకు రూ. 1500 చొప్పున ఏడాదికి రూ. 18,000 ‘ఆడబిడ్డ నిధి’ కింద ఇస్తామని, అది కూడా జూన్ 2024 నుంచే అమలు చేస్తామని వాగ్దానం చేశారు. తీరా ఇప్పుడు రెండేళ్లు గడిచినా ఆ పథకం అతీగతీ లేదు. కానీ, ఇప్పుడు ఏకంగా తిరుపతి సాక్షిగా ‘ఆర్థిక ఇబ్బందులు’ (Financial Issues) అంటూ సీఎం ఆ పథకం గురించి దాటవేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జూన్ 2024 నుంచి ఇస్తామన్న హామీ ప్రకారం లెక్కిస్తే.. ఇప్పటివరకు ప్రతి మహిళకు చంద్రబాబు ప్రభుత్వం రూ. 36,000 బాకీ పడింది. రాష్ట్రంలో ఉన్న సుమారు రెండు కోట్ల మంది మహిళలను నమ్మించి, ఓట్లు వేయించుకుని ఇప్పుడు చేతులెత్తేయడం ముమ్మాటికీ ద్రోహమేనని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మొట్టమొదటి హామీకే దిక్కు లేదు.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశామని ఎలా చెప్పుకుంటున్నారని నిలదీస్తున్నారు.
వైఎస్ జగన్(Y. S. Jagan Mohan Reddy) హయాంలో మహిళలకు ‘అమ్మఒడి(Ammavodi)’, ‘ఆసరా(Aasara)’, ‘చేయూత(Cheyutha)’, ‘కాపు నేస్తం’(Kapu Nestham) వంటి ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకే నగదు జమ అయ్యేది. చంద్రబాబు వస్తే అంతకంటే ఎక్కువ ఇస్తారనే ఆశతో మహిళలు నమ్మితే.. ఉన్న పాత పథకాలకు పాతర వేయడమే కాకుండా, ఇచ్చిన హామీని సైతం అమలు చేయకుండా మోసం చేశారనే చర్చ ఊపందుకుంది.
ఎన్నికల సమయంలో టీడీపీ(TDP) నాయకులు ఇంటింటికీ వచ్చి ఇచ్చిన ‘ఆడబిడ్డ నిధి’ బాండ్లను ఇప్పుడు ఏం చేసుకోవాలో పాలుపోక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ బాండ్లను పట్టుకుని నిలదీస్తారనే భయంతోనే చంద్రబాబు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల నెపాన్ని ముందుకు తెస్తున్నారని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
సూపర్ సిక్స్ అంటూ ప్రగల్భాలు పలికి.. ఉచిత గ్యాస్ సిలిండర్లు(Free Gas Cylinders), తల్లికి వందనం (Talliki Vandanam) అంటూ అరకొరగా అమలు చేస్తూ కాలయాపన చేస్తున్న కూటమి ప్రభుత్వం, ఇప్పుడు నేరుగా మహిళల ఆర్థిక స్వావలంబనకు సంబంధించిన ‘ఆడబిడ్డ నిధి’ని అటకెక్కించడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించి అమలు చేసిన వైఎస్ జగన్ పాలనకు.. అధికారంలోకి రాగానే అప్పులు, ఆర్థిక ఇబ్బందులంటూ బుకాయించే చంద్రబాబు మార్క్ పాలనకు ఉన్న తేడాపై మహిళలకు ఇప్పటికే ఒక స్పష్టత వచ్చిందంటున్నారు విశ్లేషకులు. తిరుపతి వేదికగా చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ కావడం ఖాయంగా కనిపిస్తోంది.








