భారత్ ఫ్యూచర్ సిటీ (FCDA) ప్రారంభోత్సవ వేడుకలో తెలంగాణ ముఖ్యమంత్రి(Telangana CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రతిపక్ష బీఆర్ఎస్‌పై(BRS) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ అభివృద్ధి చరిత్రను ప్రస్తావించిన సీఎం, హైటెక్ సిటీ (HITEC City), ఔటర్ రింగ్ రోడ్(Outer Ring Road – ORR), అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) వంటి ప్రాజెక్టులను గతంలో కూడా కొందరు వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును (Future City Project) అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రచారం చేసే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, అలాంటి నాయకులకు భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన వర్షాలకు నగరం అతలాకుతలం కావడంపై కూడా సీఎం స్పందించారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల ఆక్రమణల వల్లే వరద పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తూ చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ(IT), ఫార్మా(Pharma), జీసీసీ సంస్థలను (GCC Companies) ఫ్యూచర్ సిటీకి తీసుకువచ్చి అంతర్జాతీయ ప్రమాణాల నగరంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాలుష్య రహిత, సుస్థిర అభివృద్ధికి ప్రతీకగా ఫ్యూచర్ సిటీని ప్రపంచానికి దిక్సూచిగా నిలబెడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.








