మహిళల రక్షణకు తమిళనాడులో ‘సింగప్పెన్’

మహిళల రక్షణకు తమిళనాడులో 'సింగప్పెన్'

మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టడమే ధ్యేయంగా.. ఆపదలో ఉన్న మహిళల ర‌క్షించేందుకు త‌మిళ‌నాడులో జోస‌ఫ్ విజ‌య్ ప్ర‌భుత్వం స‌రికొత్త ప‌థ‌కానికి నాంది ప‌లికింది. క‌ష్టాల్లో ఉన్న మ‌హిళ‌ల‌ నుంచి వచ్చే అత్యవసర కాల్స్‌కు క్షణాల వ్యవధిలో స్పందించేందుకు తమిళనాడు ప్రభుత్వం సరికొత్త అడుగు వేసింది. “సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్” (Singappen Special Task Force) అనే ప్రత్యేక మహిళా పోలీస్ విభాగాన్ని సీఎం విజయ్ అధికారికంగా ప్రారంభించారు.

చెన్నైలోని రాజరత్నం స్టేడియంలో జరిగిన కార్య‌క్ర‌మంలో ముఖ్యమంత్రి విజ‌య్‌ ఈ ప్రత్యేక విభాగానికి సంబంధించిన లోగోను, అనంతరం ఈ టాస్క్ ఫోర్స్ కోసం కేటాయించిన ప్రత్యేక పెట్రోలింగ్ వాహనాలను ఆయన స్వయంగా నడిపి జెండా ఊపి ప్రారంభించారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీఎం విజయ్ సంతకం చేసిన తొలి ఫైళ్లలో ఈ ‘సింగప్పెన్’ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు ఒకటి కావడం విశేషం. మహిళల భద్రతకు తాము ఇస్తున్న ప్రాధాన్యతకు ఇదే నిదర్శనమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ సరికొత్త ప్రత్యేక విభాగానికి సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) కె. భవనేశ్వరి నేతృత్వం వహిస్తున్నారు. ఈ టాస్క్ ఫోర్స్ నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షణలోనే పనిచేస్తుంది.

సింగ‌ప్పెన్‌ టాస్క్ ఫోర్స్‌లో కేవలం సాధారణ మహిళా పోలీసులే కాకుండా సైబర్ క్రైమ్, సోషల్ మీడియా సెల్, తమిళనాడు స్పెషల్ పోలీస్ బెటాలియన్ల నుంచి ఎంపిక చేసిన నిపుణులైన మహిళా సిబ్బందికి ప్రత్యేక ప్యాట్రోలింగ్, క్విక్ రెస్పాన్స్ విద్యల్లో శిక్షణ ఇచ్చి రంగంలోకి దించారు.

‘సింగప్పెన్’ ప్రధాన బాధ్యతలు
మహిళా రక్షణ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కనిపించే బాధ్యతలను ఈ టాస్క్ ఫోర్స్‌కు అప్పగించారు.

  • మహిళలపై వేధింపులు ఎక్కువగా జరిగే ఐటీ కారిడార్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విద్యాసంస్థల పరిసరాలను గుర్తించి అక్కడ నిరంతరం నిఘా ఉంచుతారు.
  • మహిళా పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ వాహనాల్లో తిరుగుతూ ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో భద్రతా భావాన్ని, ధైర్యాన్ని నింపుతారు.
  • ఆపదలో ఉన్న మహిళల నుంచి ఎలాంటి కంప్లైంట్ లేదా అత్యవసర కాల్ వచ్చినా, క్షణాల వ్యవధిలో ఈ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ కల్పిస్తాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment