హైదరాబాద్‌లో (Hyderabad) మరోసారి నేపాలి గ్యాంగ్ (Nepali Gang) కలకలం సృష్టించింది. గచ్చిబౌలి (Gachibowli) పరిధిలోని హిల్ రిడ్జ్ విల్లాస్‌లో (Hill Ridge Villas) జరిగిన భారీ చోరీ నగరవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో నెల రోజుల క్రితమే పనిలో చేరిన నేపాలి దంపతులు కమల్(Kamal), విమలా (Vimala) కోట్ల రూపాయల విలువైన బంగారం(Gold), వెండి(Silver), వజ్రాభరణాలు(Diamond Jewellery), నగదుతో (Cash) పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇంటి యజమాని కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకుని ఈ దంపతులు చోరీకి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇంట్లోని రెండు చోట్ల భద్రపరిచిన బంగారు నగలు, వజ్రాభరణాలు, వెండి వస్తువులు, నగదుతో పాటు పూజా గదిలోని విగ్రహానికి అలంకరించిన బంగారు గొలుసు కూడా మాయమైనట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు (Gachibowli Police) సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపగా, వాటిలో కొన్ని బృందాలు నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లినట్లు సమాచారం. చోరీకి గురైన ఆస్తుల మొత్తం విలువపై ఇంకా స్పష్టత రాలేదని, పూర్తి లెక్కలు తేలిన తర్వాత అధికారిక వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.








