దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ‘డీలిమిటేషన్’ (Delimitation) (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వేగంగా అడుగులు వేస్తోంది. రాబోయే పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లును (Delimitation Bill) ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం (Modi Government సిద్ధమవుతున్నట్లు సమాచారం. గత ప్రత్యేక సమావేశాల్లో స్వల్ప తేడాతో వీగిపోయిన ఈ బిల్లుకు, మారిన రాజకీయ సమీకరణలు ఇప్పుడు కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి.
గతంలో డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీలు ఇప్పుడు పునరాలోచనలో పడినట్టు సమాచారం. ముఖ్యంగా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీతో (Congress Party) తెగదెంపులు చేసుకున్న తర్వాత, డీఎంకే(DMK) తన రాజకీయ విధానాన్ని మార్చుకుంటోంది. “రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం, మా ప్రాతినిధ్యం తగ్గకుండా ఉంటే డీలిమిటేషన్ను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు” అని డీఎంకే అంతర్గత వర్గాలు సంకేతాలు ఇస్తున్నట్టు సమాచారం.
గతంలో వాజ్పేయి మంత్రివర్గంలో (Vajpayee Cabinet) భాగస్వామిగా ఉన్న డీఎంకే, మళ్లీ కేంద్ర పెద్దలతో తెరవెనుక చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. డీఎంకేతో పాటు పలువురు టీఎంసీ (TMC) ఎంపీలు కూడా ఈ బిల్లుకు సహకరించే అవకాశం ఉందని సమాచారం. ఈ రెండు పార్టీలకు కలిపి లోక్సభలో సుమారు 50 మంది ఎంపీలు ఉండటం, ఈ బిల్లు పాస్ కావడానికి కలిసొచ్చే అంశం.
దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ (Assembly స్థానాలను 50 శాతం వరకు పెంచేలా ఈ డీలిమిటేషన్ బిల్లును కేంద్రంలోని పెద్దలు రూపొందించారు. గత ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును మెజార్టీ సభ్యులు వ్యతిరేకించారు. ఫలితంగా బిల్లు వీగిపోయింది. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఈసారి బిల్లు గట్టెక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
డీలిమిటేషన్తో పాటు, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘జమిలి ఎన్నికల’ (One Nation One Election) బిల్లును కూడా వీలైనంత త్వరగా ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. వర్షాకాల సమావేశాల మొదటి వారంలోనే జేపీసీ (JPC) తన నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. దేశవ్యాప్తంగా రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
రాబోయే పార్లమెంట్ సమావేశాలు దేశ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టంగా మారనున్నట్లు కేంద్రంలో జరుగుతున్న పరిస్థితుల ద్వారా అర్థం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ప్రధాన బిల్లులను ఆమోదింపజేసుకుంటుందా, లేదా అనేది వేచి చూడాలి.








