తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా థియేటర్ల యజమానులకు (ఎగ్జిబిటర్స్), గిల్డ్ నిర్మాతలకు మధ్య నడుస్తున్న పర్సంటేజీ విధానం వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ ప్రభావం మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న రామ్‌చరణ్ నటించిన పెద్ది సినిమాపై చూపనున్నట్టు సమాచారం. దీంతో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. ఈ రోజు హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన గంటకు పైగా సుదీర్ఘంగా సమావేశమయ్యారు.
ఈ కీలక భేటీలో ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ డి. సురేష్ బాబు, ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, కేఎల్ నారాయణ, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, రెంటల్ (అద్దె) విధానంలో వస్తున్న నష్టాలు, ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్న పర్సంటేజీ సిస్టమ్ లాంటి అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
రెండు రోజుల్లో కీలక ప్రకటన: దిల్ రాజు
సమావేశం ముగిసిన అనంతరం ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ఎగ్జిబిటర్ల సమస్యలపై ఫిల్మ్ ఛాంబర్ ఇటీవలే ఒక కమిటీని నియమించిందని, ఆ కమిటీ సేకరించిన పూర్తి వివరాలను చిరంజీవి ముందే తెప్పించుకుని అధ్యయనం చేశారని తెలిపారు. “మేమంతా కలిసి ఇండస్ట్రీ సమస్యలను చిరంజీవికి క్షుణ్ణంగా వివరించాము. ఇది ఏదో ఒక ‘పెద్ది’ సినిమాకు సంబంధించిన సమస్య కాదు.. మొత్తం చిత్ర పరిశ్రమ మనుగడకు సంబంధించిన పెద్ద సమస్య. దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారికంగా పూర్తి వివరాలను వెల్లడిస్తాం” అని దిల్ రాజు స్పష్టం చేశారు.
చిరంజీవి రెస్పాన్స్ బాగుంది – ఎగ్జిబిటర్ శ్రీధర్
మరో ప్రతినిధి, ఎగ్జిబిటర్ శ్రీధర్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి స్పందించిన తీరుపై హర్షం వ్యక్తం చేశారు. “సింగిల్ స్క్రీన్ థియేటర్లు ప్రస్తుతం పడుతున్న కష్టాలు, సమస్యలు ఇన్ని ఉన్నాయా అని చిరంజీవి ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయన రెస్పాన్స్ చాలా పాజిటివ్‌గా ఉంది. త్వరలోనే ఈ సమస్యలన్నీ పూర్తిగా సమసిపోతాయని ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు.
రంగంలోకి గిల్డ్ నిర్మాతలు..
ఎగ్జిబిటర్ల వెర్షన్ విన్న వెంటనే చిరంజీవి గిల్డ్ నిర్మాతలకు ఫోన్ చేసి తన నివాసానికి పిలిపించారు. ఎగ్జిబిటర్ల డిమాండ్లపై గిల్డ్ నిర్మాతల అభిప్రాయాలను కూడా తెలుసుకుని, రెండు వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని ప్రకటించేందుకు చిరంజీవి కసరత్తు చేస్తున్నారు. మరికాసేపట్లో గిల్డ్ నిర్మాతలతో చిరంజీవి భేటీ కానున్నారు.
మరోవైపు, చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చించేందుకు రేపు (మంగళవారం) రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సినీ నిర్మాతల ప్రతినిధి బృందం భేటీ కానుండటం టాలీవుడ్లో మరింత ఆసక్తికరంగా మారింది.
చిరంజీవితో సమావేశమైన ఎగ్జిబిటర్స్ బృందం
— Telugu Feed (@Telugufeedsite) May 25, 2026
తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు డి.సురేష్ బాబు, నిర్మాతలు కె.ఎల్.నారాయణ, దిల్ రాజు, సునీల్ నారంగ్, ఎగ్జిబిటర్స్ శ్రీధర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు జువ్వాడి శేఖర్, అనుపమ్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, బాలగోవింద్ రాజు తదితరులు హాజరు https://t.co/uxsMg8tDZQ pic.twitter.com/mjmPhfDIYO








