దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యుజి (NEET-UG) 2026 ప్రశ్నపత్రం లీకేజీ (Question Paper Leakage) కేసులో దర్యాప్తు సంస్థలు కీలక పురోగతి సాధించాయి. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజస్థాన్‌కు (Rajasthan) చెందిన మనీష్ యాదవ్‌ను (Manish Yadav) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో నీట్ లీకేజీ నెట్‌వర్క్ ఎంత లోతుగా విస్తరించిందో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి.
ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు, ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో మొత్తం 15 మందిని అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా ఈ పేపర్ ఎక్కడ ప్రింట్ అయ్యిందనే దానిపై స్పష్టత వచ్చింది. మహారాష్ట్రలోని (Maharashtra) నాసిక్‌లో ఉన్న ఒక ప్రెస్ నుంచి ఈ ప్రశ్నపత్రం లీకైనట్లు అధికారులు గుర్తించారు. అక్కడ ముద్రించిన పేపర్‌ను నిందితులు ఫోటోల రూపంలో బయటకు పంపినట్లు సమాచారం.
దర్యాప్తులో తేలిన అత్యంత షాకింగ్ అంశం ఏమిటంటే.. మే 3న జరగాల్సిన పరీక్షకు సుమారు 42 గంటల ముందే ప్రశ్నపత్రం లీక్ అయ్యింది. అంటే పరీక్షకు దాదాపు రెండు రోజుల ముందే పేపర్ మాఫియా చేతికి ప్రశ్నలు అందాయి. దీనిని ఉపయోగించుకుని వారు భారీగా డబ్బు వసూలు చేసి, ఎంపిక చేసిన అభ్యర్థులకు జవాబులను చేరవేసినట్లు నిర్ధారణ అయ్యింది.
ఈ పేపర్ లీక్ కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితం కాలేదని, దీని వెనుక అంతర్రాష్ట్ర ముఠా ఉందని పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర, హర్యానా, బిహార్, ఉత్తరాఖండ్, కాశ్మీర్, కేరళ వంటి రాష్ట్రాలకు విస్తరించింది. ఒక్కో అభ్యర్థి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి, రహస్య ప్రాంతాల్లో వారికి శిక్షణ ఇచ్చినట్లు సమాచారం.
ప్రధాన నిందితుడు మనీష్ యాదవ్ (Manish Yadav) అరెస్టుతో ఈ కుంభకోణంలో మరికొందరు పెద్దల హస్తం కూడా బయటపడే అవకాశం ఉంది. పరీక్షకు ముందే ఇంత పెద్ద ఎత్తున లీకేజీ జరగడంతో, పరీక్ష పారదర్శకతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం పరీక్షను రద్దు చేసి సీబీఐ(CBI) విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దర్యాప్తు సంస్థలు ఇప్పుడు మనీష్ యాదవ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నాయి.








