కూటమి రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన పిఠాపురం నియోజకవర్గంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ కోసం తన రాజకీయ భవిష్యత్తును పక్కనపెట్టి సీటును త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మకు టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆయనను పిఠాపురం టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా పిఠాపురంలో టీడీపీ-జనసేన క్యాడర్ మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇటీవల ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో లేకపోవడంపై వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వర్మకు, జనసేన నేత పెండెం దొరబాబు వర్గానికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగడమే కాకుండా, బాహాబాహీకి దారితీసింది.
పవన్ కళ్యాణ్ ఫిర్యాదుతోనేనా?
ఆదివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పిఠాపురం రాజకీయాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. వర్మ పదే పదే వివాదాలు సృష్టిస్తున్నారని, దీనివల్ల కూటమి సమన్వయానికి విఘాతం కలుగుతోందని పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ప్రోటోకాల్ విషయంలో వర్మ అతిగా ప్రవర్తిస్తున్నారని, జనసేన నేతలపై దాడులకు యత్నిస్తున్నారని పవన్ సీరియస్ అయినట్లు సమాచారం.
త్యాగానికి దక్కిన ఫలితం ఇదేనా?
వర్మను పదవి నుంచి తప్పించడంపై ఆయన అనుచరులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన సొంత సీటును త్యాగం చేసి, గ్రామ గ్రామాన తిరిగిన వర్మకు ఇచ్చే బహుమతి ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో లేదని అడిగినందుకు వర్మపై జనసేన నేతలు దాడికి యత్నిస్తే.. అండగా ఉండాల్సిన చంద్రబాబు ఆయనపైనే చర్య తీసుకోవడంపై వర్మ వర్గం రగిలిపోతోంది.
ఇటీవల వర్మకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇచ్చినప్పటికీ, నియోజకవర్గ ఇంచార్జ్ పదవి నుంచి తప్పించడం అంటే ఆయనకు స్థానికంగా పట్టు లేకుండా చేయడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి వర్మ స్థానంలో ఎవరిని నియమిస్తారు లేదా అక్కడ పార్టీ వ్యవహారాలను ఎవరు చూస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నిర్ణయంతో పిఠాపురం టీడీపీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడే అవకాశం కనిపిస్తోంది.








