పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల (Assembly Elections Results) అనంతరం ఆ రాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. ఎన్నికల్లో బీజేపీ(BJP) ఘనవిజయం సాధించి, 200కు పైగా సీట్లు గెలుచుకోవడంతో టీఎంసీ (TMC) అధికారాన్ని కోల్పోయింది. అయితే, ఈ ఫలితాలను అంగీకరించేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌పై కీలక ఆరోపణలు చేశారు.
కోల్‌కతాలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆమె సంచలన వ్యాఖ్యలు చేస్తూ, తాను సీఎం పదవికి (CM Post) రాజీనామా (Resignation) చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను లోక్ భవన్ కు వెళ్లి రాజీనామా సమర్పించాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో నైతిక విజయం టీఎంసీదేనని ఆమె పేర్కొనడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఎన్నికల ప్రక్రియపై మమతా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది బీజేపీ సాధించిన విజయం కాదు, సీట్లను దొంగిలించి (లూటీ) సాధించిన గెలుపు అని ఆమె ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) బీజేపీ ఏజెంట్లా పనిచేసిందని, సుమారు 100 సీట్లను బీజేపీ అక్రమంగా దక్కించుకుందని విమర్శించారు. కౌంటింగ్ కేంద్రాల్లో తమ ఏజెంట్లను అనుమతించలేదని, ఎన్నికలకు ముందే టీఎంసీ నేతలను అరెస్ట్ చేసి వేధించారని ఆమె మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ఈసీ ఒక ‘విలన్'(Villain) పాత్ర పోషించిందని, సీఆర్పీఎఫ్ బలగాలు బీజేపీ గూండాల్లా ప్రవర్తించాయని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తన ఓటమిని అంగీకరించని మమతా, రాబోయే రోజుల్లో ‘ఇండియా బ్లాక్’ (INDIA Bloc) తరపున మరింత ఉధృతంగా పోరాడుతానని ప్రకటించారు. ప్రధాని మోదీ, అమిత్ షా ఎన్నికల ప్రక్రియలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. బీజేపీకి ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయడం అలవాటని, తనపై జరుగుతున్న ఈ రాజకీయ దాడిపై న్యాయపరంగా, ప్రజాక్షేత్రంలో పోరాడుతానని ఆమె స్పష్టం చేశారు.
MamataBanerjee says, ‘I will not resign as Chief Minister’ pic.twitter.com/wLgv61mXXE
— Telugu Feed (@Telugufeedsite) May 5, 2026








