‘మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్‌’కు స్వ‌స్తి.. విజ‌య్ సైలెంట్ వేవ్‌

'మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్' స్వ‌స్తి.. విజ‌య్ సైలెంట్ వేవ్‌

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయి. ముఖ్యంగా మీడియా మేనేజ్‌మెంట్‌తో, అనుకూల ప‌త్రిక‌లు, మీడియా ఛానళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయాలను శాసించవచ్చని, ప్ర‌త్య‌ర్థుల‌పై బుర‌ద‌జ‌ల్ల‌వ‌చ్చ‌ని భావించే పార్టీలకు ఈ ఫలితాలు ఒక బలమైన హెచ్చరికగా నిలిచాయి.

ఎన్నో ఏళ్లుగా తమిళనాడు రాజకీయాలు డీఎంకే (DMK), అన్నా డీఎంకే (AIADMK) చుట్టూనే తిరిగాయి. ఈ రెండు పార్టీలకు తమ వాదనలను వినిపించడానికి, ప్రత్యర్థులను అణచివేయడానికి బలమైన మీడియా సామ్రాజ్యాలు ఉన్నాయి. అధికారాన్ని కొల్పోయిన DMK పార్టీకి సన్ న్యూస్, కలైంజర్ టీవీ, AIADMK పార్టీకి జయా టీవీ, న్యూస్ జే టీవీల మ‌ద్ద‌తుంది.

కానీ, 2026 ఎన్నికల్లో విజయ్ స్థాపించిన TVK ఎలాంటి ప్రధాన మీడియా మద్దతు లేకుండానే 108 స్థానాల్లో విజయం సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ వంటి దిగ్గజాలు సైతం ఓటమి పాలవ్వడం గమనార్హం. కేవలం సోషల్ మీడియాను, క్షేత్రస్థాయిలో కేడర్‌ను నమ్ముకుని విజయ్ సాధించిన ఈ విజయం “ప్రజల ఆదరణ ఉంటే మీడియా మేనేజ్‌మెంట్ అక్కర్లేదు” అని నిరూపించింది.

ఏపీలో ‘ఎల్లో మీడియా’ వర్సెస్ సోషల్ మీడియా
తమిళనాడు ఫలితాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇప్పుడు ఇదే రకమైన చర్చ నడుస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీకి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈటీవీ వంటి సంస్థలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయనేది బహిరంగ రహస్యం. ఈ మీడియా సంస్థల ఏకపక్ష ధోరణి వల్ల ప్రజల్లో వాటిపై విశ్వసనీయత తగ్గుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

“కేవలం మీడియాలో గొప్పగా చూపించుకోవడం వల్ల ఓట్లు పడవు. తమిళనాడులో డీఎంకేకు ఉన్న మీడియా బలం స్టాలిన్‌ను కాపాడలేకపోయింది. ఏపీలో కూడా అధికార పార్టీ అనుకూల మీడియా (ఎల్లో మీడియా) టీఆర్‌పీ రేటింగ్‌లు పడిపోవడం ప్రజల్లో వస్తున్న మార్పున‌కు సంకేతం” అని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

వైసీపీకి దొరికిన అస్త్రం
ప్రస్తుతం ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీకి బలమైన మీడియా మద్దతు లేకపోయినప్పటికీ, ఆ పార్టీ తన సోషల్ మీడియా విభాగాన్ని సమర్థవంతంగా వాడుకుంటోంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోపాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో స‌ఫ‌లమైంది. అందుకు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై జరుగుతున్న అరెస్టులే నిద‌ర్శ‌నం. ప్రధాన మీడియాలో తమ గొంతు వినిపించనప్పుడు, సోషల్ మీడియానే ఆయుధంగా మార్చుకుని ప్రజల వద్దకు వెళ్లడం వైసీపీ తరహా వ్యూహంగా కనిపిస్తోంది.

ఏపీలోనూ ఇదే ఫలితమా?
తమిళనాడులో ప్రజలు పాత రాజకీయ పార్టీల మీడియా యుద్ధాలకు విసిగిపోయి, సరికొత్త ప్రత్యామ్నాయాన్ని ఆశీర్వదించారు. ఏపీలో కూడా అధికార పార్టీ మీడియా అండతో ప్రతిపక్షాన్ని అణచివేయాలని చూస్తే, అది బెడ్‌ఫైర్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు. “రాజకీయం అంటే ప్రజల గుండెల్లో ఉండటం.. టీవీ స్క్రీన్ల మీద కాదు” అనే సత్యాన్ని విజయ్ విజయం చాటిచెప్పింది. ఇదే ట్రెండ్ ఏపీలోనూ కొనసాగితే, మీడియా బలాన్ని నమ్ముకున్న పార్టీలకు భవిష్యత్తులో గట్టి గుణపాఠం తప్పకపోవచ్చు.

Join WhatsApp

Join Now

Leave a Comment