దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల యావత్ భారతదేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. దేశం ఒక గొప్ప ఆర్థిక వేత్తను కోల్పోయిందని భావిస్తోంది. నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన మన్మోహన్‌సింగ్, చికిత్స పొందుతూనే కన్నుమూశారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్ నేతలంతా నివాళులర్పిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు, గవర్నర్, కాంగ్రెస్ శ్రేణులు, సినీ ప్రముఖులు పలువురు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్ధిక వేత్త, మహా నాయకుడు, సంస్కరణ వాది అన్నింటికి మించి గొప్ప మానవతావాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఒక గొప్ప కుమారుడిని కోల్పోయిందని సీఎం అవేదన వ్యక్తం చేశారు. మాజీ ప్రధానమంత్రి మృతిపై సోషల్ మీడియా ఎక్స్‌లో తన సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.
చంద్రబాబు నివాళి
మాజీ ప్రధాని, ప్రఖ్యాత ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మేధావి, రాజనీతిజ్ఞుడైన మన్మోహన్ సింగ్ వినయం, జ్ఞానం, సమగ్రత కలిగిన గొప్ప వ్యక్తి అని సీఎం కొనియాడారు. 1991లో ఆర్థికమంత్రిగా చేసిన సంస్కరణల మొదలు ప్రధానమంత్రిగా పదేళ్లపాటు దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారని చంద్రబాబు గుర్తు చేశారు.
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మన్మోహన్ మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మాజీ ప్రధాని మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటు. పదేళ్లపాటు దేశ ప్రధానిగా గొప్ప సేవలందించారని ప్రశంసించారు. ఆర్బీఐ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా ఆర్థిక సంస్కరణలతో దేశ పురోభివృద్ధికి ఎంతగానో కృషిచేశారన్నారు.
కేసీఆర్ సంతాపం..
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతాపం ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని కేసీఆర్ అన్నారు. ఆయన మృతి తీరని లోటు అన్నారు.
వైఎస్ షర్మిల సంతాపం..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం అత్యంత బాధాకరమని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడు, అవిశ్రాంత యోధుడు, మహోన్నత నాయకుడు భారత దేశ ఆర్థికశిల్పి మన్మోహన్ సింగ్. ఆయన మరణం దేశానికి తీరని లోటు. మన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, దేశ ప్రధానిగా ఆయన అందించిన సేవలు అమూల్యమన్నారు. మన్మోహన్ సారథ్యంలో మన దేశం అత్యధిక వృద్ధి రేటు సాధించి, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్ధిక మాంద్యం ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థపై పడకుండా గాడిలో పెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ దే అని వైఎస్ షర్మిల సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.








